దీపావళి పండగ సందర్భంగా చార్మినార్‌ సమీపంలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవారి ఖజానా నుంచి నాణేల పంపిణీ ప్రారంభం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆదివారం సాయంత్రం మొదలైన ఈ పంపిణీ కోసం భక్తులు బారులు తీరారు. గుల్జార్‌ హౌస్‌ వరకు క్యూలైన్లు విస్తరించాయి.

భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ నిర్వాహకులు నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా నాణేలు పంపిణీ చేస్తున్నారు. అమ్మవారి ఖజానా నుంచి లభించే నాణెం ఇంటికి తీసుకెళ్తే శుభాలు కలుగుతాయని, సిరిసంపదలు పెరుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ నమ్మకంతో ప్రతి ఏటా దీపావళి సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

మూడు రోజుల పాటు అమ్మవారి ఖజానా నుంచి నాణేల పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. దీంతో రానున్న రెండు రోజుల్లోనూ ఆలయానికి భక్తుల రాక మరింత పెరిగే అవకాశం ఉంది.