ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి వేడుకల వేళ పలుచోట్ల అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. బాణాసంచా కారణంగా సంభవించిన అగ్నిప్రమాదాలతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. ముఖ్యంగా కృష్ణా, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో చోటుచేసుకున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగించాయి.

వివరాల్లోకి వెళితే, కృష్ణా జిల్లా గన్నవరంలోని ఒక గృహోపకరణాల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సదరు దుకాణానికి భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో బాణాసంచా కారణంగా ఒక ఆయిల్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. వేడుకల్లో భాగంగా కాల్చిన తారాజువ్వ నేరుగా గోడౌన్‌పై పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇక గుంటూరు జిల్లా తెనాలిలోని గంగమ్మపేటలో ఉన్న ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూంలోకి టపాసులు దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఈ ప్రధాన ఘటనలే కాకుండా, పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల చిన్నపాటి అగ్నిప్రమాదాలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.