టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో ఒక కీలక అంశంపై మాట్లాడేందుకు తాను ఎంతో ఆలోచించానని భారత మాజీ సహాయ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే వెల్లడించాడు. ఆటలో ఎంతటి దిగ్గజమైనా, ఫామ్‌ కోల్పోయినప్పుడు సరైన సూచనలు చేయడం కోచ్‌ బాధ్యత. అయితే కోహ్లీ లాంటి ఆటగాడి విషయంలో ఆ పని చేయడం కోచ్‌కు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అతడు అభిప్రాయపడ్డాడు.

2024-25లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కోహ్లీ టెస్టుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా ఆఫ్‌ స్టంప్‌ అవతల పడే బంతులను డ్రైవ్‌ చేయబోయి వికెట్‌ సమర్పించుకోవడం అతడికి సమస్యగా మారింది. ఆ పర్యటనలో కోహ్లీ తొమ్మిది ఇన్నింగ్స్‌లో ఎనిమిదిసార్లు క్యాచ్‌ రూపంలోనే ఔటయ్యాడు. ఈ సమస్యను గమనించిన టెన్ డస్కటే.. నాలుగో టెస్టు సమయంలో అతడితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు.

అయితే నేరుగా వెళ్లి కోహ్లీ బ్యాటింగ్‌లోని లోపాలను ఎత్తిచూపడం సరైన పద్ధతి కాదని భావించాడు. అందుకే ఎలా మాట్లాడాలి? ఏ సమయంలో మాట్లాడాలి? అన్న విషయాలపై ముందుగానే ఆలోచించాడు. చివరకు వర్షం కారణంగా ఆట నిలిచిన సమయంలో కోహ్లీతో సంభాషణ మొదలుపెట్టాడు. తన మాటలను కోహ్లీ ఎంతో సానుకూలంగా స్వీకరించాడని, ఇద్దరి మధ్య మంచి చర్చ జరిగిందని టెన్ డస్కటే తెలిపాడు.

ఆటగాళ్లతో ఇలాంటి విషయాలు మాట్లాడేందుకు చాలామంది కోచ్‌లు వెనుకాడుతున్నారని ఆయన పేర్కొన్నాడు. తమ ఉద్యోగాన్ని సమర్థించుకోవడానికో, ఆటగాళ్ల ఆటతీరులో అనవసరంగా జోక్యం చేసుకోవడానికో ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం కలుగుతుందన్న భయం వారిలో ఉంటుందని చెప్పాడు. అయితే ఆటగాడికి ఉపయోగపడే సూచన చేయడం, అతడిని మరింత గందరగోళానికి గురిచేయడం మధ్య సున్నితమైన తేడా ఉందని వివరించాడు. ఆధునిక క్రికెట్‌లో ఆటగాళ్ల ప్రాధాన్యం పెరగడంతో కోచ్‌లు తమ అభిప్రాయాలను చెప్పేందుకు కూడా భయపడుతున్నారని టెన్ డస్కటే వ్యాఖ్యానించాడు.