ఈ మధ్య కాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై కన్నడ సినిమాలు కాస్త గట్టిగానే సందడి చేస్తున్నాయి. కన్నడ నుంచి ఎక్కువగా క్రైమ్ .. మిస్టరీ .. సస్పెన్స్ తో కూడిన కంటెంట్ ను వదులుతున్నారు. ఈ తరహా జోనర్ నుంచి వచ్చిన సిరీస్ లు .. సినిమాలకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. అలా కన్నడ నుంచి రీసెంటుగా ఓటీటీలోకి అడుగుపెట్టిన సినిమాగా ''అనిరీక్షిత అథిదిగలు' కనిపిస్తుంది. మనోజ్ అన్నయ్య దర్శకత్వం వహించిన సినిమా ఇది. 

వివేక్ సింహా .. మైత్రీ .. సంప్రతి .. హరిత షా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, సెప్టెంబర్ 18వ తేదీన అక్కడి థియేటర్లలో విడుదలైంది. స్వామినాథన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'అమెజాన్ ప్రైమ్' వారు దక్కించుకున్నారు. వినోద్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.థియేటర్స్ వైపు నుంచి ఈ సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ మంచి మార్కులను కొట్టేసింది.

'అనిరీక్షిత అతిథిగలు' అంటే, అనుకోని అతిథులు అని అర్థం. ఒక ప్రేమజంట సరదాగా గడపడం కోసం ఒక నిర్జన ప్రదేశంలోని గెస్టు హౌస్ కి వెళుతుంది. ఎవరూ లేని ఏకాంత ప్రదేశం దొరికినందుకు ఆ జంట సంతోష పడుతూ ఉండగా, అనుకోని నలుగురు అతిథులు అక్కడ అడుగుపెడతారు. అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ఆ సంఘటనతో కథలో ఎలాంటి మలుపులు చోటుచేసుకుంటాయి? అనేది కథ.