కరీంనగర్ జిల్లాలో రూ.4 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పట్టణాభివృద్ధి (అర్బన్ డెవలప్‌మెంట్) పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కలిస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. నగరంలో ప్రధాన సమస్యగా మారిన డంప్ యార్డ్ అంశాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని, దీనిపై ఎవరూ అనవసర వివాదాలు చేయవద్దని సూచించారు. అభివృద్ధి పనులకు కొందరు కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. కాంట్రాక్టర్లను భయపెడితే పనులు కావని, కరీంనగర్ పేరును సర్వనాశనం చేయాలని చూసే నీచ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని హితవు పలికారు. చిల్లర వేషాలు వేస్తే ప్రజలు ఊరుకోరని, పనులను అడ్డుకుంటే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, కరీంనగర్ డంప్ యార్డ్ సమస్య ఇప్పటిది కాదని, దీని పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సైతం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. తమకు ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత ప్రజా సంక్షేమమే ముఖ్యమని పేర్కొన్నారు. దీంతో పాటు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.