సామాజిక బాధ్యత, సాంకేతిక నైపుణ్యం కలిస్తే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాడు హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన 17 ఏళ్ల అక్షిత్ ఖేరా. కేవలం 12వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థి, సామాన్యుల రవాణా కష్టాలు తీర్చేందుకు అతి తక్కువ ఖర్చుతో నడిచే సోలార్-అసిస్టెడ్ త్రిచక్ర వాహనాన్ని రూపొందించాడు. కిలోమీటరు ప్రయాణానికి కేవలం 13 పైసలు మాత్రమే ఖర్చయ్యే ఈ వాహనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

గురుగ్రామ్‌లోని హేరిటేజ్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పెన్షియల్ స్కూల్‌లో చదువుతున్న అక్షిత్, తన ఇంటి పనిమనిషి కుటుంబం పడుతున్న రవాణా ఇబ్బందులను చూసి చలించిపోయాడు. వారికి అందుబాటులో ఉండేలా, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన వాహనాన్ని తయారు చేయాలని సంకల్పించాడు. ఈ ఆలోచనతోనే ప్రయోగానికి శ్రీకారం చుట్టి, కేవలం రూ. 1,02,536 బడ్జెట్‌లోనే ఈ వాహనాన్ని విజయవంతంగా తయారు చేశాడు.

వాహనం ప్రత్యేకతలు
ఈ మూడు చక్రాల వాహనాన్ని బహుళ ప్రయోజనకరంగా తీర్చిదిద్దారు. వాతావరణాన్ని తట్టుకునేలా ఇద్దరు కూర్చునేందుకు క్యాబిన్‌, వెనుక భాగంలో సామాన్లు పెట్టుకోవడానికి కార్గో బాక్స్ ఉన్నాయి. వాహనం పైభాగంలో 400W మోనోక్రిస్టలైన్ సోలార్ ప్యానెల్‌ను అమర్చారు. ఇది ప్రయాణికులకు నీడను ఇవ్వడమే కాకుండా, బ్యాటరీని నిరంతరం ఛార్జ్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ వాహనం కనీసం 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. రోజుకు సగటున 50 కిలోమీటర్లు ప్రయాణిస్తే, అందులో 63% విద్యుత్ అవసరాలను సౌరశక్తే తీరుస్తుందని అక్షిత్ వివరించాడు.

సవాళ్లను అధిగమించి..
ఈ వాహన తయారీ కోసం అక్షిత్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. దాదాపు డజనుకు పైగా వర్క్‌షాప్‌లు అతని ప్రాజెక్టును నిరాకరించగా, చివరికి అరుణ్ అనే ఫ్యాబ్రికేటర్ సహాయంతో దీనిని పూర్తిచేశాడు. ఖర్చు తగ్గించేందుకు ఢిల్లీలోని మాయాపురి మార్కెట్‌లో విడిభాగాల కోసం బేరసారాలు ఆడి రూ.17,000 ఆదా చేశాడు. దీర్ఘకాలిక మన్నిక కోసం లిథియం-అయాన్ బ్యాటరీని ఎంచుకున్నాడు. ప్రస్తుతం ఇది ప్రోటోటైప్ దశలోనే ఉందని, భవిష్యత్తులో ఆటోమొబైల్ కంపెనీల భాగస్వామ్యంతో దీనిని వాణిజ్యపరంగా సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆశిస్తున్నాడు.