ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ సినిమాస్‌లో ఓ వ్యక్తికి, సెక్యూరిటీ సిబ్బందికి మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించి సినిమా హాల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన అతడిని సిబ్బంది అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

అసలేం జరిగింది?
అక్టోబర్ 30న పీవీఆర్ థియేటర్‌కు సినిమా చూసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించి ఉన్నాడు. ప్రవేశ ద్వారం వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు అతడిని ఆపి, లోపలికి అనుమతించలేమని స్పష్టం చేశారు. కెమెరా ఉన్న పరికరాలను, ముఖ్యంగా మెటా గ్లాసెస్‌ను థియేటర్లలోకి అనుమతించబోమని, ఇది తమ సంస్థ నిబంధన అని వివరించారు. అక్కడే ఉన్న నోటీస్ బోర్డును కూడా చూపించారు.

అయితే, ఆ వ్యక్తి సిబ్బందితో వాదనకు దిగాడు. "నేను సినిమా రికార్డ్ చేయాలనుకుంటే నా ఫోన్‌తోనే చేయగలను కదా? ఫోన్‌ను లోపలికి అనుమతిస్తున్నారు కానీ, నా కళ్లజోడును మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారు? నాకు కంటిచూపు సరిగా లేదు, ఇవి నా ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్. ఇవి పెట్టుకోకపోతే నాకు సినిమా హాల్‌లో ఏమీ కనిపించదు. అప్పుడు నేను ఇక్కడికి రావడం కూడా వృథా" అని ఆవేదన వ్యక్తం చేశాడు.

దీనికి సెక్యూరిటీ సిబ్బంది ఎంతో ఓపికగా సమాధానమిచ్చారు. "మీ సమస్య మాకు అర్థమైంది, కానీ మీ కోసం మేం నిబంధనలను ఉల్లంఘించలేం. మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడే మెటా గ్లాసెస్‌కు అనుమతి లేదని స్పష్టంగా పేర్కొన్నాం. కావాలంటే మళ్లీ ఆ గైడ్‌లైన్స్ చూపిస్తాను. దయచేసి గ్లాసెస్‌ను ఇక్కడ డిపాజిట్ చేసి, లోపలికి వెళ్లి సినిమా చూడండి" అని కోరారు.

సోషల్ మీడియాలో చర్చ
నవంబర్ 5న లక్ష్య మెహతా అనే యూజర్ ఈ 2 నిమిషాల 17 సెకన్ల నిడివి ఉన్న వీడియోను 'ఎక్స్‌' (ట్విట్టర్)లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. ఈ ఘటన ఏ పీవీఆర్‌లో జరిగిందో, ఆ వ్యక్తి ఏ సినిమా చూడటానికి వచ్చాడో తెలియరాలేదు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

"ఏ నిబంధన అయితే ఉందో దాన్ని గౌరవించాలి. సాధారణ కళ్లజోడు పెట్టుకుని సినిమా చూడొచ్చు కదా? ఆ పాలసీని తయారుచేసింది సెక్యూరిటీ గార్డులు కాదు, వారితో వాదించడం అనవసరం" అని ఒకరు కామెంట్ చేశారు. "ఫోన్‌తో రికార్డ్ చేస్తే సులభంగా తెలిసిపోతుంది, కానీ మెటా గ్లాసెస్‌తో రికార్డ్ చేస్తే ఎవరికీ అనుమానం రాదు" అని మరో యూజర్ అభిప్రాయపడ్డారు.

పీవీఆర్ పాలసీ ఏంటి?
పీవీఆర్ ఐనాక్స్ నిబంధనల ప్రకారం.. మెటా గ్లాసెస్ లేదా కెమెరా ఉన్న ఎలాంటి స్మార్ట్ ఐవేర్, బాడీ కెమెరాలను థియేటర్లలోకి అనుమతించరు. పైరసీని నిరోధించే చర్యల్లో భాగంగా ఈ కఠిన నిబంధనను అమలు చేస్తున్నారు. రికార్డింగ్ ఫంక్షన్ ఆన్‌లో ఉన్నా, ఆఫ్‌లో ఉన్నా ఇలాంటి పరికరాలను లోపలికి అనుమతించరు. 

ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారి టికెట్ రద్దు చేసి, థియేటర్ నుంచి బయటకు పంపే అధికారం సిబ్బందికి ఉంది. ఒకవేళ ఎవరైనా సినిమాను రికార్డ్ చేస్తూ పట్టుబడితే, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ ఘటనతో కొత్త టెక్నాలజీకి, పాత నిబంధనలకు మధ్య ఉన్న అంతరంపై మరోసారి చర్చ మొదలైంది.