గ్లోబల్ ఐకాన్‌గా గుర్తింపు పొందిన నటి ప్రియాంక చోప్రా జోనాస్, తాజాగా సోషల్ మీడియాలో విమర్శల పాలయ్యారు. దీపావళి వేడుకల్లో భాగంగా ఆమె మాంసాహారం తింటున్నట్లు కనిపించడమే ఇందుకు కారణమైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న తన నివాసంలో జరిగిన దీపావళి వేడుకలకు సంబంధించిన ఫొటోలను ప్రియాంక సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోలలో డెకరేషన్, ఫ్యామిలీతో పాటు ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి.

అయితే, వాటిలో ఒక ఫొటోలో ప్రియాంక నాన్-వెజ్ పదార్థం తింటున్నట్లు కనిపించడంతో నెటిజన్లు ఆమెను టార్గెట్ చేశారు. పండుగ రోజు మాంసాహారం తినడం ఏంటని ప్రశ్నిస్తూ కామెంట్ల వర్షం కురిపించారు. "దీపావళి రోజు నాన్-వెజ్ తినకూడదు", "మీరు దీపావళి నాడు మాంసాహారం తింటున్నారా?", "దీపాలకు బదులు కొవ్వొత్తులు ఎందుకు?" అంటూ కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరికొందరు ఆమె డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్‌పైనా విమర్శలు చేశారు.

అయితే, ప్రియాంక విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ భారతీయ సంప్రదాయాలను, పండుగలను ఎంతగానో గౌరవిస్తారన్న విషయం తెలిసిందే. ఇటీవల దసరా పండుగను కూడా తన ఇంట్లో ఘనంగా జరుపుకొన్నారు. ఆ సమయంలో ప్రత్యేక పూజలు, శివలింగ అభిషేకం, హోమం, కన్యా పూజ వంటివి నిర్వహించారు. తన కూతురు మాలతి మేరీ పాదాలను భర్త నిక్ జోనాస్ కడుగుతున్న ఫొటోను కూడా ఆమె పంచుకున్నారు. అంతేకాదు మాలతికి తరచూ హిందూ శ్లోకాలను నేర్పిస్తూ భారతీయ సంస్కృతికి దగ్గరగా పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ప్రియాంకకు మద్దతుగా నిలుస్తుండగా, దీపావళి ఫుడ్ మెనూపై మాత్రం చర్చ కొనసాగుతోంది.