కొన్ని కథలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తూనే వినోదాన్ని పంచుతుంటాయి. సహజత్వానికి దగ్గరగా మానవ స్వభావాలను ఆవిష్కరిస్తూనే ఆలోచింపజేస్తాయి. చాలా కుటుంబాలను దగ్గరగా పరిశీలన చేస్తే ఒక విషయం అర్థమవుతుంది. పేదరిమలో ఉన్నప్పుడు వాళ్లంతా చాలా ప్రేమతో ఉంటారు. అనుకోకుండా వాళ్ల మధ్యకి డబ్బు వచ్చిపడినప్పుడు ఆ ప్రేమ కలుషితం అవుతూ ఉంటుంది. ఇందుకు అతీతంగా వ్యవహరించేవారు సంఖ్య చాలా అరుదనే చెప్పాలి. 

అలాంటి ఒక కథతో రూపొందిన సినిమానే 'ఆల్ పాస్'. తమిళంలో మోహన్ రంగనాథన్ నిర్మించిన ఈ సినిమాకి మైదీన్ దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 9వ తేదీన థియేటర్లలో విడుదలైన సినిమా ఇది. దుష్యంత్ జయప్రకాశ్ .. సెంథిల్ కుమారి.. సుబ్రహ్మణ్యం శివ .. జనని కునశీలన్ .. వినోదిని వైద్యనాథన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. జేమ్స్ వసంతన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నెల 6వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. 

ఈ కథ చెన్నైలోని ఒక బస్తీలో జరుగుతుంది. ఈ బస్తీలో మూడు కుటుంబాల వారు చాలా కాలంగా నివసిస్తూ ఉంటారు. ఈ పేదరికాన్ని తట్టుకుని నిలబడాలంటే, తామంతా ఉమ్మడి కుటుంబంగా ఉండటమే మార్గమని భావిస్తారు. అంతా కలిసి ఒకే ఇంట్లో ఎంతో ప్రేమగా నివసిస్తూ ఉంటారు. అదే సమయంలో ఊహించని విధంగా వాళ్ల మధ్యలోకి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చిపడుతుంది. అప్పటి నుంచి వాళ్లలో ఎలాంటి మార్పు వస్తుంది? వాళ్లతో ఏమేం చేయిస్తుంది? చివరికి వాళ్లు గ్రహించే నిజం ఏమిటి? అనేది కథ.