బాలీవుడ్ నటి ఈషా డియోల్, ఆమె మాజీ భర్త, వ్యాపారవేత్త భరత్ తఖ్తానీ కలిసి కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ముంబైలో జరిగిన దీపావళి వేడుకలో ఈ మాజీ దంపతులు పాల్గొన్నారు. విడాకుల తర్వాత వీరిద్దరూ ఇలా ఒకే వేదికపై జంటగా కనిపించడం బి-టౌన్‌లో ఆసక్తిని రేకెత్తించింది.

ఈ కార్యక్రమానికి ఈషా లేత గులాబీ రంగు చీరలో హాజరుకాగా, భరత్ క్రీమ్ కలర్ ‘బంధ్‌గాలా’ దుస్తుల్లో మెరిశాడు. వీరిద్దరూ కెమెరాలకు నవ్వుతూ పోజులిచ్చారు. 12 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ, తాము విడిపోతున్నట్లు ఈషా, భరత్ 2024 ఫిబ్రవరిలో అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరికి రాధ్య, మిరాయా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

"మా పిల్లల సంక్షేమమే మాకు అత్యంత ప్రాధాన్యం. అందుకే స్నేహపూర్వకంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం" అని అప్పట్లో వారు ఒక ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. తాము చెప్పిన విధంగానే పిల్లల భవిష్యత్తు కోసం ఈ మాజీ జంట సౌహార్దపూర్వక సంబంధాలను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే వీరిద్దరూ కలిసి ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది.

ఈ దీపావళి వేడుకల్లో శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రా, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు.