ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌ను వివాహం చేసుకున్నప్పుడు తన పంజాబీ కుటుంబం, స్నేహితులు ఎలా స్పందించారో కొరియోగ్రాఫర్ పోనీ వర్మ తాజాగా గుర్తుచేసుకున్నారు. రోజూ సాంబార్ తిని చచ్చిపోతావేమోనని తన కుటుంబ సభ్యులు సరదాగా ఆందోళన వ్యక్తం చేశారని, 12 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్న వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావంటూ స్నేహితులు పెద్ద గొడవే చేశారని ఆమె వెల్లడించారు. నటి ప్రేమ యూట్యూబ్ ఛానల్‌లో జరిగిన ఓ సంభాషణలో పోనీ వర్మ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా పోనీ వర్మ మాట్లాడుతూ.. "మా కుటుంబానికి దక్షిణాది సంస్కృతిపై పెద్దగా అవగాహన లేదు. అప్పుడప్పుడు హోటళ్లలో ఇడ్లీ-సాంబార్ తినడం తప్ప వారికి తెలియదు. దీంతో, నువ్వు ప్రకాశ్ రాజ్‌ను పెళ్లి చేసుకుంటే రోజూ సాంబార్ తినాల్సి వస్తుందని, బహుశా అలా తిని చచ్చిపోతావేమోనని సరదాగా అనేవారు. కానీ నాకు సాంబార్ అంటే ఇష్టమని వారికి చెప్పాను," అని నవ్వేశారు. స్నేహితులైతే వయసు వ్యత్యాసంపై తీవ్ర అభ్యంతరం తెలిపారని అన్నారు.

అయితే, ఆ వయసు వ్యత్యాసమే తమ బంధానికి బలమని పోనీ వర్మ అభిప్రాయపడ్డారు. "జీవితంలో ఎంతో అనుభవం ఉన్న ప్రకాశ్ రాజ్ మాత్రమే నా లోతును, నా కష్టాలను, నా మానసిక స్థితిని అర్థం చేసుకోగలరు. నేనొక ఎగసిపడే అలలా ఉంటే, ఆయన నా జీవితానికి ఒక ఒడ్డులా నిలిచారు. జీవితంలో వెనుకబడిపోతున్నాననే నా ఆతృతను తగ్గించి, ప్రశాంతతను నేర్పించారు. చెంచా పక్కనపెట్టి చేత్తో హాయిగా తినడం కూడా ఆయనే నేర్పించారు," అని వివరించారు.

తల్లి మరణంతో తాను తీవ్రమైన దుఃఖంలో ఉన్నప్పుడు, ప్రకాశ్ రాజ్ తన మొదటి భార్య లలిత కుమారి నుంచి విడాకులు తీసుకుంటున్న సమయంలో తామిద్దరి మధ్య స్నేహం మొదలైందని పోనీ తెలిపారు. కలిసి సినిమాలకు పనిచేస్తున్న క్రమంలో ఆ స్నేహం ప్రేమగా మారింది. 2003లో వచ్చిన ‘అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాలో వీల్‌చైర్‌లో ఉన్న వయసు మళ్లిన వ్యక్తిగా ప్రకాశ్ రాజ్‌ను మొదటిసారి చూశానని, అప్పుడు ఆయన నిజంగానే వయసు మళ్లిన వ్యక్తే అనుకున్నానని ఆమె గుర్తుచేసుకున్నారు.

2010లో ప్రకాశ్ రాజ్, పోనీ వర్మ వివాహం చేసుకోగా, వారికి 2015లో కుమారుడు వేదాంత్ జన్మించాడు. ప్రకాశ్ రాజ్‌కు మొదటి భార్యతో మేఘన, పూజ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి కుమారుడు సిద్ధార్థ్ 2004లో ప్రమాదవశాత్తు మరణించిన విషయం తెలిసిందే.