ప్రేమ కోసం వెతుకుతున్నారా? అందుకోసం విదేశాలకు వెళ్లే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? అదీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫిన్‌లాండ్‌ పర్యటించే అవకాశం! ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా పేరొందిన ఫిన్‌లాండ్‌.. ఒంటరివారికి ఇలాంటి వినూత్న అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రేమను వెతుక్కుంటూ రావాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవివాహితులకు ఆహ్వానం పలుకుతోంది. ఈ మేరకు ఆ దేశ పర్యాటక సంస్థ ‘విజిట్‌ ఫిన్‌లాండ్‌’ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.

16 మందికి ఉచిత పర్యటన
‘ఫిన్నిష్‌ డిన్నర్‌ డేట్‌’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 16 మంది ఒంటరి వ్యక్తులను ఎంపిక చేసి ఫిన్‌లాండ్‌కు తీసుకెళతారు. 2027 ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు ఈ పర్యటన కొనసాగుతుంది. విమాన టికెట్లు, వసతి, భోజనం, ఇతర కార్యక్రమాల ఖర్చులన్నీ పర్యాటక సంస్థే భరిస్తుంది.

విందుతో పరిచయం.. ప్రేమకు అవకాశం!
ఈ పర్యటనలో భాగంగా హెల్సింకి, టాంపెరే నగరాల్లో ప్రత్యేక విందులు ఏర్పాటు చేస్తారు. ఎంపికైన అంతర్జాతీయ అతిథులు స్థానిక ఒంటరి వ్యక్తులతో కలిసి భోజనం చేస్తారు. ఫిన్‌లాండ్‌ ప్రత్యేక వంటకాలను రుచిచూపిస్తారు. చేపలు, బెర్రీ పండ్లు, అడవుల్లో సేకరించిన పుట్టగొడుగులతో ప్రముఖ చెఫ్‌లు ప్రత్యేక మెనూ సిద్ధం చేస్తారు. ఈ పరిచయాల ద్వారా కొత్త స్నేహాలు, ప్రేమకు అవకాశం కల్పించడమే కార్యక్రమ ఉద్దేశం.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
18 ఏళ్లు నిండిన, ప్రపంచంలోని ఏ దేశానికి చెందిన వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఫిన్‌లాండ్‌ నివాసితులు ఈ కార్యక్రమానికి అర్హులు కారు. వ్యక్తిగతంగానే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి ఇంగ్లిష్‌లో ఓ చిన్న వీడియో రూపొందించాలి. ‘డిన్నర్‌ డేట్‌కు వెళితే ఏ వంటకం వడ్డిస్తారు? ఎందుకు?’ అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి.

నవంబర్‌ 10 చివరి తేదీ
ఈ వీడియోను టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లేదా యూట్యూబ్‌లో పబ్లిక్‌ అకౌంట్‌ ద్వారా పోస్టు చేయాలి. #FinnishDinnerDate హ్యాష్‌ట్యాగ్‌తో పాటు విజిట్‌ ఫిన్‌లాండ్‌ను ట్యాగ్‌ చేయాలి. దరఖాస్తులకు నవంబర్‌ 10 ఉదయం 11.59 గంటల వరకు గడువు ఉంది. ఎంపికైన వారి వివరాలను డిసెంబర్‌ 1న ప్రకటిస్తారు.