యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన తల్లి, దివంగత నటి శ్రీదేవిని మరోసారి గుర్తుచేసుకున్నారు. హాలోవీన్ సెలబ్రేషన్ ను పురస్కరించుకుని, శ్రీదేవి కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిన 'నగీనా' (1986) సినిమాలోని ఆమె ఐకానిక్ లుక్‌ను రీక్రియేట్ చేశారు. అచ్చం తన తల్లిని పోలినట్టుగా సిద్ధమై, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా, అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే, హాలొవీన్ కోసం జాన్వీ కపూర్ 'నాగిన' చిత్రంలోని శ్రీదేవి పాత్రను ఎంచుకున్నారు. గులాబీ రంగు కాస్ట్యూమ్, దానికి సరిపోయే ఆభరణాలు, ప్రత్యేకమైన మేకప్, హెయిర్‌స్టైల్‌తో అప్పటి శ్రీదేవిని గుర్తుకుతెచ్చారు. కేవలం గెటప్‌తోనే సరిపెట్టకుండా, 'నగీనా' సినిమా పోస్టర్‌ను, కొన్ని నాటకీయ దృశ్యాలను కూడా రీక్రియేట్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు.

ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ జాన్వీ ఓ భావోద్వేగ క్యాప్షన్ జోడించారు. "అందరికీ హ్యాపీ హాలోవీన్. సినీ చరిత్రలోని అత్యంత ఐకానిక్ క్షణాలలో ఒకదాన్ని రీక్రియేట్ చేయాల్సి వచ్చింది. హాలోవీన్ అంటే మనకు ఇష్టమైన పాత్రలు, పాప్ కల్చర్ మూమెంట్స్‌గా మారడం. కొన్నిసార్లు అవి భయపెట్టొచ్చు, కొన్నిసార్లు ఫన్నీగా ఉండొచ్చు, మరికొన్నిసార్లు అది ఒక నివాళి. అమ్మ (శ్రీదేవి), రిషి అంకుల్, అమ్రిష్ సర్‌ల కంటే ఐకానిక్ ఎవరుంటారు!!" అని ఆమె పేర్కొన్నారు.

జాన్వీ పోస్ట్‌పై బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నటి కరీనా కపూర్ "టూ టూ గుడ్" అని కామెంట్ చేయగా, ఆమె సోదరి కరిష్మా కపూర్ హార్ట్ ఎమోజీలతో తన ప్రేమను వ్యక్తం చేశారు. భారతీయ సినిమా తొలి మహిళా సూపర్‌స్టార్‌గా కీర్తి పొందిన శ్రీదేవి, 'సద్మా', 'మిస్టర్ ఇండియా', 'చాందిని', 'లమ్హే' వంటి ఎన్నో మరపురాని చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆమె నటించిన 'నగీనా' చిత్రం అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే పాత్రలో జాన్వీ కనిపించడంతో అభిమానులు శ్రీదేవిని గుర్తుచేసుకుంటున్నారు.