ఉత్తరాఖండ్‌లోని యోగ్ నగరి రిషికేశ్ రైల్వే స్టేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. చుట్టూ పచ్చని కొండలు, సుందరమైన పర్వతాల మధ్య నిర్మించిన ఈ స్టేషన్.. బాలీవుడ్ సినిమా సెట్‌ను తలపిస్తోందంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట‌ వైరల్ అవుతున్నాయి.

ఇటీవల ఓ కంటెంట్ క్రియేటర్ రైలులో రిషికేశ్ పర్యటనకు వెళ్లారు. యోగ్ నగరి రైల్వే స్టేషన్ అందాలకు ముగ్ధుడై ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. స్టేషన్‌లోని పరిశుభ్రత, ప్రయాణికులకు అందుబాటులో ఉన్న సేవలు, ఆహ్లాదకరమైన పరిసరాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రముఖ యశ్ రాజ్ ఫిల్మ్స్ సినిమాలలో చూపించే అందమైన లొకేషన్ల మాదిరిగా ఈ స్టేషన్ ఉందని అభివర్ణించారు. ఇంతటి అందమైన స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని తన పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో, ఈ స్టేషన్‌పై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.

రిషికేశ్-కర్ణప్రయాగ్ రైల్వే లైన్ మరియు ప్రతిష్ఠాత్మక చార్ ధామ్ ప్రాజెక్టులో భాగంగా 2021లో ఈ యోగ్ నగరి రిషికేశ్ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. ఇది రిషికేశ్ పట్టణానికి పశ్చిమ దిశలో ఉంది. సాధారణంగా నగరాల్లో రద్దీగా, కాంక్రీట్ నిర్మాణాలతో ఉండే రైల్వే స్టేషన్లకు భిన్నంగా, ఇది పూర్తిగా ప్రకృతి ఒడిలో నిర్మించబడింది. స్టేషన్ ప్లాట్‌ఫాంపై నిలబడితే చుట్టూ కనిపించే పచ్చని పర్వతాలు ప్రయాణికులకు ఓ సరికొత్త అనుభూతిని పంచుతాయి.

ఈ స్టేషన్ ఫొటోలు వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, అభివృద్ధిపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే, ఇది రిషికేశ్ ప్రధాన స్టేషన్ కాదని, ప్రత్యేకంగా నిర్మించిన 'యోగ్ నగరి రిషికేశ్' స్టేషన్ అని కొందరు స్పష్టతనిచ్చారు. మొత్తం మీద ఆధునిక హంగులను ప్రకృతి సౌందర్యంతో మిళితం చేసి నిర్మించిన ఈ రైల్వే స్టేషన్, దేశవ్యాప్తంగా ప్రజల మన్ననలను పొందుతోంది.