రోజువారీ పనుల నుంచి చదువు, ఉద్యోగం వరకు ఎన్నో విషయాల్లో చాట్‌జీపీటీ వంటి ఏఐ చాట్‌బాట్‌లు ఉపయోగపడుతున్నాయి. సందేహాలకు సమాధానాలు ఇవ్వడం, సమాచారాన్ని విశ్లేషించడం, రాతపనుల్లో సాయం చేయడం వంటి పనులను సులభతరం చేస్తున్నాయి. అయితే వీటితో ఏ పని పడితే ఆ పని చేయించుకోవచ్చని భావించకూడదు. ముఖ్యంగా కొన్ని రకాల అభ్యర్థనలకు చాట్‌జీపీటీ సహకరించదు. అలాంటి ఐదు విషయాల గురించి తెలుసుకుందాం.

1. ఇతరుల ఖాతాలను హ్యాక్‌ చేయమని అడగొద్దు
స్నేహితుల సోషల్‌ మీడియా ఖాతాల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించడం, ఇతరుల వ్యక్తిగత సందేశాలను చూడటం వంటి పనులకు చాట్‌జీపీటీ సాయం చేయదు. ఇలాంటి చర్యలు చట్టవిరుద్ధం. ఖాతా భద్రతను పెంచుకోవడం, హ్యాక్‌ అయిన ఖాతాను తిరిగి పొందడం వంటి చట్టబద్ధమైన విషయాల్లో మాత్రం మార్గదర్శనం పొందవచ్చు.

2. భవిష్యత్తును చెప్పమని కోరొద్దు
భవిష్యత్తులో ఎవరిని పెళ్లి చేసుకుంటారు? ఏ ఉద్యోగం వస్తుంది? ఎప్పుడు ధనవంతులవుతారు? వంటి ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు చాట్‌జీపీటీ ఇవ్వలేదు. ఇది జ్యోతిషం చెప్పదు. అందుబాటులో ఉన్న సమాచారం, ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా సాధ్యమైన పరిణామాలను వివరించగలదు. కానీ భవిష్యత్తును కచ్చితంగా చెప్పలేదు.

3. పరీక్షల్లో మోసం చేసేందుకు ఉపయోగించొద్దు
పరీక్షల్లో సమాధానాలు రహస్యంగా రాయించడం, ఇతరుల పనిని తమదిగా చూపించడం వంటి మోసాలకు చాట్‌జీపీటీని ఉపయోగించకూడదు. అలా చేయడం వల్ల విద్యార్థుల అభ్యాసం దెబ్బతినడంతో పాటు విద్యాసంస్థల నిబంధనలను ఉల్లంఘించినట్లవుతుంది. అయితే పాఠాలు అర్థం చేసుకోవడం, నమూనా ప్రశ్నలు తయారు చేసుకోవడం, పరీక్షలకు సిద్ధం కావడం వంటి వాటికి దీన్ని ఉపయోగించుకోవచ్చు.

4. ప్రమాదకరమైన పనులకు సూచనలు అడగొద్దు
బాంబులు తయారు చేయడం, ఇతరులకు హాని కలిగించడం, హింసాత్మక చర్యలకు పాల్పడటం వంటి ప్రమాదకరమైన పనులకు సంబంధించిన సూచనలు చాట్‌జీపీటీ ఇవ్వదు. ఇలాంటి సమాచారం దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉండటంతో భద్రతా పరిమితులు ఉన్నాయి.

5. ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని అడగొద్దు
ఇతరుల ఫోన్‌ నంబర్లు, ఇంటి చిరునామాలు, బ్యాంకు వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని చాట్‌జీపీటీ నుంచి పొందాలని ప్రయత్నించకూడదు. ఇతరుల గోప్యతను గౌరవించడం ముఖ్యం. అలాగే మన పాస్‌వర్డ్‌లు, బ్యాంకు పిన్‌లు, ఓటీపీలు, కార్డు వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని ఏఐ చాట్‌బాట్‌లలో పంచుకోకూడదు.

చాట్‌జీపీటీని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే చదువు, ఉద్యోగం, వ్యక్తిగత పనుల్లో మంచి సహాయక సాధనంగా మారుతుంది. అయితే అది ఇచ్చే ప్రతి సమాధానాన్ని గుడ్డిగా నమ్మకుండా, ముఖ్యమైన విషయాలను విశ్వసనీయమైన ఆధారాలతో సరిచూసుకోవడం అవసరం.