పులివెందులలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు, శాంతిభద్రతల సమస్యకు జగనే పూర్తి కారణమని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. ప్రజాప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తుంటే, జగన్ ఓటమి భయంతో స్వయంగా పులివెందులకు వచ్చి అశాంతిని సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాప్తాడు బాలికను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందులలో ప్రతి వార్డునూ ఏకగ్రీవం చేసిన జగన్ రెడ్డి, ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని లోకేశ్ ఎద్దేవా చేశారు. "గత ఎన్నికల్లో పులివెందులలో ఒక్కరైనా నామినేషన్ వేయగలిగారా? కనీసం పోటీ చేసే ధైర్యం ఎవరికైనా ఉండేదా? అని ప్రజలు ప్రశ్నించాలి. ఆనాడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, ఇప్పుడు మేం స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహిస్తుంటే నీతులు చెబుతున్నారు. మా ప్రభుత్వంలో అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్ వేసేందుకు పోలీసు భద్రత కల్పించాం. అందుకే పులివెందులలో కూడా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇది ఓర్వలేకే జగన్ స్వయంగా రంగంలోకి దిగారు" అని లోకేశ్ అన్నారు.

పులివెందులలో వ్యూహాత్మకంగా అల్లర్లు సృష్టిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. "ఆదివారం మధ్యాహ్నం బెంగళూరు నుంచి ప్రత్యేకంగా పులివెందులకు వచ్చి సమస్యలు సృష్టించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలను రెచ్చగొట్టి, వాహనాలను తగులబెట్టించి, ఆ నిందను మా ప్రభుత్వంపై వేస్తున్నారు. గొడవలు సృష్టించిన వెంటనే హెలికాప్టర్‌లో తిరిగి బెంగళూరు వెళ్లిపోయి, జాతీయ మీడియాను పిలిచి తామే బాధితులమని నాటకాలాడుతున్నారు" అని లోకేశ్ విమర్శించారు.

రాష్ట్రంలో ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఇటీవల విశాఖ, కడప నగరాల్లో కూడా ఎలాంటి సమస్య తలెత్తలేదని లోకేశ్ గుర్తుచేశారు. "అలాంటప్పుడు కేవలం పులివెందులలోనే ఎందుకు సమస్యలు వస్తున్నాయి? దీనికి జగన్ రెడ్డి వైఖరే ఏకైక కారణం. తన కంచుకోటలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయడానికి ముందుకు రావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు" అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై తమకు, తమ ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని, ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. పులివెందులలో చోటుచేసుకుంటున్న ప్రతి ఘటన వెనుక జగన్ రెడ్డి ప్రమేయం ఉందని ఆయన పునరుద్ఘాటించారు.