ఐదో టీ20లోనూ భారత జట్టుకు నిరాశే ఎదురైంది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌ అద్భుతంగా ఆడి భారత్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ 18 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి మూడు మ్యాచ్ ల్లో వరుస విజయాలతో భారత్‌ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, చివరి రెండు మ్యాచ్ ల్లోనూ న్యూజిలాండ్ నెగ్గడంతో, ఈ ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ ఆధిక్యం 3-2కి తగ్గింది. 

నేటి మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ కిషన్‌ (61; 32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (50; 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. నమన్‌ ధీర్‌ 33, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 22 పరుగులు చేశారు. అయితే మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో ఆడమ్‌ మిల్నే 19 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. నాథన్‌ స్మిత్‌, బ్లెయిర్‌ టిక్నర్‌ రెండేసి వికెట్లు తీశారు.

192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌కు టిమ్‌ సీఫర్ట్‌ (93; 50 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లు), గ్లెన్‌ ఫిలిప్స్‌ (65 నాటౌట్‌; 38 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత విజయాన్ని అందించారు. డారిల్‌ మిచెల్‌ 29 పరుగులతో రాణించాడు. సీఫర్ట్‌-మిచెల్‌ జోడీ రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించగా, సీఫర్ట్‌-ఫిలిప్స్‌ జంట మూడో వికెట్‌కు 86 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఒక్కో వికెట్‌ తీశారు. సీఫర్ట్‌-ఫిలిప్స్‌ ధాటికి భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మరో రెండు ఓవర్లు మిగిలుండగానే కివీస్‌ లక్ష్యాన్ని అందుకుంది.