రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాప్తాడు పాఠశాల విద్యార్థినిపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పరారీలో ఉన్న నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆత్మకూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, అతను పోలీసులపై రాళ్లతో దాడికి యత్నించాడు. దీంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన హేమంత్‌ను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే...

రాప్తాడు మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థినిపై ఆమె బంధువైన హేమంత్ దారుణంగా దాడి చేసిన విషయం తెలిసిందే. రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని తరగతి గదిలోకి ఎలక్ట్రిక్ రంపంతో (చైన్‌సా) ప్రవేశించిన హేమంత్.. బాలిక తల, ముఖం, వీపు భాగాలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కాళ్లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నిందితుడు రంపాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన బాలికను తొలుత అనంతపురం ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రస్తుతం మణిపాల్ ఆసుపత్రిలోని పీఐసీయూలో చికిత్స పొందుతోంది.

ఈ కేసును సవాలుగా స్వీకరించిన పోలీసులు, నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. హేమంత్ ఆత్మకూరు సమీపంలోని అడవుల్లో దాక్కున్నట్టు సమాచారం అందడంతో, ప్రత్యేక బృందాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. లొంగిపోవాలని పోలీసులు సూచించినప్పటికీ, హేమంత్ వారిపైకి రాళ్లు విసురుతూ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కొందరు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. సుమారు ఆరు రౌండ్ల కాల్పులు జరిపినట్టు సమాచారం.

బుల్లెట్ గాయాలతో కుప్పకూలిన హేమంత్‌ను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.