ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చాట్‌బాట్‌ అయిన చాట్‌జీపీటీ ఇచ్చిన వైద్య సలహా పాటించడం వల్లే తమ కుమార్తె మరణించిందని ఆరోపిస్తూ ఓ జంట టెక్ దిగ్గజం ఓపెన్‌ఏఐపై దావా వేసింది. ఈ విషాద ఘటన అమెరికాలోని సియాటెల్‌లో చోటుచేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు దాఖలు చేసిన ఈ కేసు, వైద్యపరమైన విషయాల్లో ఏఐపై ఆధారపడటంలోని ప్రమాదాలపై తీవ్ర చర్చను రేకెత్తిస్తోంది.

అస‌లేం జ‌రిగిందంటే..!
సియాటెల్‌కు చెందిన బోవెన్ వాన్ (31) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చాలాకాలంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారు. ఆమె తన అనారోగ్య నియంత్రణకు లామోట్రిజిన్ అనే మందును వాడుతున్నారు. అయితే, ఈ మందుల సైడ్ ఎఫెక్ట్స్ తన ఆలోచనా శక్తి, మాటతీరుపై ప్రభావం చూపుతున్నాయని ఆమె ఆందోళన చెందారు. దీనికితోడు ఆమె పనిచేస్తున్న అమెజాన్ సంస్థలో ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఏర్పడటంతో మరింత ఒత్తిడికి గురయ్యారు.

ఈ క్రమంలో ఆమె చాట్‌జీపీటీని ఆశ్రయించారు. తన మందుల డోసును రోజుకు 400 మిల్లీగ్రాముల నుంచి కొన్ని వారాల్లో సున్నాకు ఎలా తగ్గించుకోవాలో చాట్‌జీపీటీ ఆమెకు ఒక ప్రణాళికను సూచించిందని తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాదు, ఈ విషయాన్ని వైద్యులకు చెప్పవద్దని కూడా ఆ చాట్‌బాట్ సలహా ఇచ్చిందని వారు పేర్కొన్నారు.

చాట్‌జీపీటీ సలహా మేరకు మందులు తగ్గించుకున్న బోవెన్ వాన్, 2026 ఫిబ్రవరిలో మూర్ఛ వ్యాధికి సంబంధించిన సమస్యలతో (సడెన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ డెత్ ఇన్ ఎపిలెప్సీ-SUDEP) మరణించారు. ఆమె మరణానంతరం నిర్వహించిన పరీక్షల్లో, ఆమె శరీరంలో లామోట్రిజిన్ మందు స్థాయిలు వైద్యపరంగా అవసరమైన దానికంటే చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. ఆమెకు చికిత్స అందించిన న్యూరాలజిస్ట్ కూడా, ఆమె పరిస్థితికి మందులు ఆపేయమని తాను ఎట్టిపరిస్థితుల్లోనూ సలహా ఇచ్చేవాడిని కాదని స్పష్టం చేశారు.

ఈ ఆరోపణలపై ఓపెన్‌ఏఐ స్పందిస్తూ, ఈ ఘటన హృదయ విదారకమని పేర్కొంది. బోవెన్ వాన్ ఉపయోగించిన చాట్‌జీపీటీ మోడల్ పాత వెర్షన్ అని, ప్రస్తుతం అందుబాటులో లేదని తెలిపింది. అత్యవసర పరిస్థితులను గుర్తించడంలో కొత్త సిస్టమ్స్ మెరుగ్గా పనిచేస్తాయని వివరణ ఇచ్చింది. ఈ కేసు ఇంకా కోర్టులో విచారణ దశలోనే ఉన్నప్పటికీ, కీలకమైన ఆరోగ్య విషయాల్లో ఏఐ సలహాలను గుడ్డిగా నమ్మడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.