రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థుల భద్రతను పటిష్ఠం చేసే దిశగా ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి పాఠశాలలో మొదటి పీరియడ్ ప్రారంభమైన వెంటనే తప్పనిసరిగా గేట్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఓ పాఠశాలలోకి చొరబడిన యువకుడు పదో తరగతి విద్యార్థినిపై దాడి చేసిన దారుణ ఘటన నేపథ్యంలో, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఈ పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల రక్షణకే తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని, ఈ విషయంలో పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.

ఆదివారం మధ్యాహ్నం బెంగళూరులోని ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్డులో ఉన్న మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మంత్రి లోకేశ్ పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దాదాపు 12 గంటల పాటు శ్రమించి సంక్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బృందాన్ని ఆయన అభినందించారు. అనంతరం బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. బాధిత బాలికను తన సొంత కూతురిలా భావించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వపరంగానే కాకుండా, తాను వ్యక్తిగతంగా, స్థానిక శాసనసభ్యురాలిగా పరిటాల సునీత అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏ అవసరం వచ్చినా సంప్రదించాలని సూచించారు.

రాప్తాడు పాఠశాలలో భవిత సెంటర్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో, నిందితుడు కార్మికుడి ముసుగులో లోపలికి ప్రవేశించి ఈ దారుణానికి పాల్పడ్డాడని మంత్రి తెలిపారు. ఈ దాడిని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోందని, నిందితుడిపై చట్టపరంగా అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలపై దాడులకు పాల్పడే వారికి అదే చివరి రోజయ్యేలా కఠిన చర్యలు ఉంటాయని, ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

దాడి జరిగిన వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడంలో తక్షణమే స్పందించిన పోలీసులను మంత్రి అభినందించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రాబోయే 48 గంటలు చాలా కీలకమని వైద్యులు తెలిపినట్లు ఆయన వెల్లడించారు. బాలిక సంపూర్ణ ఆరోగ్యంతో సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలని అందరూ ప్రార్థించాలని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. 

ఈ పర్యటనలో మంత్రి వెంట ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ, పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారియా తదితరులు ఉన్నారు.