టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఒక క్యాలెండర్‌ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన ఐదో టీ20లో ఈ ఘనత అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 32 బంతుల్లో 61 పరుగులు చేసి జట్టు స్కోరు పెరగడంలో కీలక పాత్ర పోషించాడు.

సూర్యకుమార్‌ రికార్డు బద్దలు
2022లో టీమిండియా మాజీ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ 31 ఇన్నింగ్స్‌ల్లో 1,164 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఇదే భారత రికార్డుగా ఉంది. ఇషాన్‌ ఈ ఏడాది 37 ఇన్నింగ్స్‌ల్లో 1,220 పరుగులు చేసి ఆ రికార్డును అధిగమించాడు. ఐదో టీ20కి ముందు అతడి ఖాతాలో 1,159 పరుగులు ఉన్నాయి. సూర్య రికార్డును అధిగమించడానికి మరో ఆరు పరుగులు అవసరం కాగా.. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే ఆ మైలురాయిని చేరుకున్నాడు.

ప్రపంచ జాబితాలో నాలుగో స్థానం
ఒక క్యాలెండర్‌ ఏడాదిలో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇషాన్‌ ప్రస్తుతం నాలుగో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రియా ఆటగాడు కరణ్‌బీర్‌ సింగ్‌ 1,488 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్‌ ఆటగాడు మహ్మద్‌ రిజ్వాన్‌ 1,326 పరుగులతో రెండో స్థానంలో, బహ్రెయిన్‌ ఆటగాడు ఫయాజ్‌ అహ్మద్‌ 1,251 పరుగులతో మూడో స్థానంలో ఉన్నారు. టెస్టు హోదా కలిగిన దేశాల ఆటగాళ్లలో ఇషాన్‌ రెండో స్థానంలో నిలిచాడు.

2 వేల పరుగుల మైలురాయి
ఇదే మ్యాచ్‌లో ఇషాన్‌ అంతర్జాతీయ టీ20ల్లో 2 వేల పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. బంతుల పరంగా ఈ ఘనత సాధించిన మూడో వేగవంతమైన భారత ఆటగాడిగా నిలిచాడు. ఇషాన్‌ 1,345 బంతుల్లో ఈ పరుగులు పూర్తి చేశాడు. అభిషేక్‌ శర్మ 1,024 బంతుల్లో, సూర్యకుమార్‌ యాదవ్‌ 1,164 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకున్నారు.

గాయాన్ని అధిగమించి మెరుపులు
ఈ సిరీస్‌లో ఇషాన్‌కు ఆరంభం ఆశించిన స్థాయిలో లేదు. ఆడిన తొలి మ్యాచ్‌లో ఒక పరుగు, నాలుగో టీ20లో సున్నాకే వెనుదిరిగాడు. కుడి తొడ కండరాల గాయంతో మధ్యలో రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే చివరి మ్యాచ్‌లో అర్ధశతకంతో మెరిసి రెండు కీలక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.