దీపావళి పండగకు కొద్ది రోజుల ముందు సామాన్యులపై పరోక్షంగా భారం పడింది. చమురు మార్కెటింగ్ సంస్థలు వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరను మరోసారి పెంచాయి. ఈ కొత్త ధరలు నేటి (నవంబర్ 1) నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే, గృహ వినియోగదారులకు ఊరటనిస్తూ 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు.

తాజా పెంపుతో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.10 పెరిగింది. దీంతో ఢిల్లీలో దీని ధర రూ.2,820కి చేరింది. స్థానిక పన్నులను బట్టి రాష్ట్రాల్లో ఈ ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయి. వాణిజ్య సిలిండర్ల ధరలు గత కొన్ని నెలలుగా తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. అక్టోబర్‌లో రూ.62.50, సెప్టెంబర్‌లో రూ.9.50 మేర ధరలు పెరిగాయి. అంతకుముందు జులై, ఆగస్టు నెలల్లో భారీగా తగ్గినప్పటికీ, ఫిబ్రవరి-జూన్ మధ్య కాలంలో ఈ సిలిండర్ ధర ఏకంగా రూ.1,373 పెరిగి రూ.3,113.50 గరిష్ఠ స్థాయికి చేరడం గమనార్హం. ఈ పెంపు హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపుతుంది.

మరోవైపు, విమానయాన రంగానికి కీలకమైన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధర కూడా పెరిగింది. లీటర్‌పై రూ.1.37 పెరగడంతో, దీని ధర రూ.138.50కి చేరింది. ఏటీఎఫ్ ధరలు పెరగడం ఇది వరుసగా నాలుగో నెల. గతంలో ఆగస్టులో లీటర్‌కు రూ.5, సెప్టెంబర్‌లో రూ.6.28, అక్టోబర్‌లో రూ.16 చొప్పున ధరలు పెరిగాయి. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో దాదాపు 40% వాటా విమాన ఇంధనానిదే కావడంతో, ఈ పెంపు విమాన టిక్కెట్ల ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు, రూపాయి-డాలర్ మారకం విలువ ఆధారంగా ప్రతి నెలా 1వ తేదీన చమురు సంస్థలు కమర్షియల్ గ్యాస్, ఏటీఎఫ్ ధరలను సవరిస్తుంటాయి. పండగ సీజన్‌లో ఈ ధరల పెంపు ఆతిథ్య రంగంపై అదనపు భారం మోపనుంది.