వైసీపీ అధినేత జగన్ రేపు (సోమవారం) బెంగళూరులో పర్యటించనున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో నిన్న దాడికి గురై తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థినిని ఆయన పరామర్శించనున్నారు.

రాప్తాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన దాడిలో బాలిక తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆమెను మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో జగన్ ఆమెను వ్యక్తిగతంగా పరామర్శించాలని నిర్ణయించుకున్నారు.

షెడ్యూల్ ప్రకారం, జగన్ రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు మణిపాల్ ఆసుపత్రికి చేరుకుంటారు. అక్కడ చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుంటారు. ఆమెకు అందుతున్న వైద్య సేవల వివరాలపై ఆరా తీస్తారు. అనంతరం, ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పనున్నారు. ఈ మేరకు వైసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది.