డిజిటల్‌ చెల్లింపులు, ఆన్‌లైన్‌ సేవలు పెరుగుతున్న కొద్దీ క్యూఆర్‌ కోడ్‌ల వినియోగం కూడా విస్తరిస్తోంది. ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ లేదా టీవీ స్క్రీన్‌పై కనిపించే క్యూఆర్‌ కోడ్‌ను ఫోన్‌తో స్కాన్‌ చేసి వెబ్‌సైట్లను తెరవడం, చెల్లింపులు చేయడం సాధారణమైపోయింది. అయితే ప్రతి క్యూఆర్‌ కోడ్‌ సురక్షితమైనదే అని భావించకూడదు. కొన్ని కోడ్‌లు నకిలీ వెబ్‌సైట్లకు తీసుకెళ్లవచ్చు. మోసపూరిత చెల్లింపులకు దారితీయవచ్చు. అందుకే స్కాన్‌ చేసే ముందు ఈ ఐదు అంశాలను పరిశీలించాలని సైబర్‌ భద్రతా సూచనలు చెబుతున్నాయి. 

1. క్యూఆర్‌ కోడ్‌ను ఎవరు చూపిస్తున్నారు?
ముందుగా ఆ కోడ్‌ ఎక్కడ కనిపించింది? ఎవరు స్కాన్‌ చేయమంటున్నారు? అనేది గమనించాలి. నమ్మకమైన వెబ్‌సైట్‌లో కనిపించే కోడ్‌కు, అనుకోకుండా పాప్‌అప్‌లో లేదా సందేశంలో వచ్చిన కోడ్‌కు తేడా ఉంటుంది. బ్యాంకు లేదా ప్రముఖ సంస్థ పేరు, లోగో కనిపించినంత మాత్రాన అది అసలైనదని నమ్మకూడదు. సంబంధిత సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో వివరాలు పరిశీలించాలి.

2. ఏ వెబ్‌సైట్‌కు తీసుకెళ్తుందో చూడాలి
కోడ్‌ స్కాన్‌ చేసినప్పుడు ఫోన్‌లో లింక్‌ ప్రివ్యూ కనిపిస్తే దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. వెబ్‌ అడ్రస్‌లో అక్షర దోషాలు, తెలియని డొమైన్లు, అసలు సంస్థ పేరును పోలిన అదనపు పదాలు ఉన్నాయేమో చూడాలి. అసలు చిరునామా కనిపించకుండా చేసే షార్ట్‌ లింక్‌ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. అనుమానం వస్తే లింక్‌ను ఓపెన్‌ చేయొద్దు.

3. వ్యక్తిగత, బ్యాంకింగ్‌ వివరాలు అడుగుతోందా?
క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తెరుచుకున్న పేజీ లాగిన్‌ వివరాలు, ఖాతా ధ్రువీకరణ సమాచారం లేదా బహుమతి పొందేందుకు వ్యక్తిగత వివరాలు అడగవచ్చు. అటువంటి సందర్భాల్లో ఆ వివరాలు ఎందుకు అడుగుతున్నారో ఆలోచించాలి. సాధారణ డిస్కౌంట్‌ పొందడానికి బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌ లేదా కార్డు పిన్‌ అవసరం లేదు. అలాంటి రహస్య వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమోదు చేయకూడదు.

4. చెల్లింపు చేయమంటోందా?
క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసిన తర్వాత చెల్లింపు పేజీ తెరుచుకుంటే, డబ్బులు అందుకునే వ్యక్తి పేరు, చెల్లించాల్సిన మొత్తం సరిగ్గా ఉన్నాయో పరిశీలించాలి. రీఫండ్‌ లేదా బహుమతి పొందాలంటే క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయాలని ఎవరైనా చెబితే అప్రమత్తంగా ఉండాలి. యూపీఐ ద్వారా డబ్బులు అందుకోవడానికి పిన్‌ నమోదు చేయాల్సిన అవసరం లేదు. వివరాలు అనుకున్నట్లుగా లేకపోతే లావాదేవీని నిలిపివేయాలి.

5. ఏదైనా యాప్‌ లేదా ఫైల్‌ డౌన్‌లోడ్‌ చేయమంటోందా?
కొన్ని క్యూఆర్‌ కోడ్‌లు యాప్‌ డౌన్‌లోడ్‌ పేజీలకు తీసుకెళ్తాయి. మరికొన్ని ఫైళ్లను తెరవాలని సూచించవచ్చు. అలాంటి వాటిని డౌన్‌లోడ్‌ చేసే ముందు మూలం, డెవలపర్‌ వివరాలు తనిఖీ చేయాలి. అధికారిక యాప్‌ స్టోర్ల నుంచే యాప్‌లను పొందడం మంచిది. తెలియని వెబ్‌సైట్‌ నుంచి యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయాలని లేదా ఫోన్‌ భద్రతా సెట్టింగ్‌లు మార్చాలని కోరితే వెంటనే ఆగిపోవాలి.