నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ నివాసాలపై ఏసీబీ దాడులు
- లక్ష్మీ భాస్కర్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు
- ఆయన నివాసంతో పాటు బంధువులు, సన్నిహితుల నివాసాల్లో ఏసీబీ సోదాలు
- భారీ ఎత్తున నగదు, ఆభరణాలు, ఆస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం
హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డిప్యూటీ సూపరింటెండెంట్‌గా సేవలు అందిస్తున్న డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్ నివాసాలు, కార్యాలయాలపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేపట్టారు. భారీ స్థాయిలో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారం, ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు ప్రారంభించాయి. ఎర్రగడ్డలోని ‘కల్పతరువు అపార్ట్‌మెంట్స్’లోని ఆయన నివాసంతో పాటు, కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులకు చెందిన దాదాపు 13 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
నిమ్స్ ఆసుపత్రిలో సుమారు 20 ఏళ్లుగా వివిధ హోదాల్లో పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మీభాస్కర్, గత ఐదేళ్లుగా డిప్యూటీ సూపరింటెండెంట్ వంటి అత్యంత కీలకమైన బాధ్యతల్లో కొనసాగుతున్నారు. వైద్య పరికరాల కొనుగోళ్లు, పరిపాలనాపరమైన నిర్ణయాల్లో గతంలోనూ ఆయనపై పలు అవినీతి ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సోదాల్లో భారీ ఎత్తున నగదు, బంగారు ఆభరణాలు, విలాసవంతమైన భవనాలు, స్థలాలు మరియు పలు వ్యాపారాల్లో పెట్టుబడులకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నట్లు సమాచారం.