కెనడాలో నివసిస్తున్న భారత సంతతి మహిళను అదృష్టం వరించింది. కేరళకు చెందిన స్నేహ జాయ్ అనే మహిళ కెనడా 'లాటో 6/49 క్లాసిక్' (Lotto 6/49 Classic) లాటరీ డ్రాలో ఏకంగా 5 మిలియన్ కెనడియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.32 కోట్లు) జాక్‌పాట్ గెలుచుకున్నారు.

స్నేహ జాయ్ తన మొబైల్‌లోని 'లాటో స్పాట్' (Lotto Spot) యాప్ ద్వారా ఈ డిజిటల్ టికెట్‌ను కొనుగోలు చేశారు. 2026 అక్టోబర్ 21న నిర్వహించిన డ్రాలో 1, 10, 18, 22, 33, 37 సంఖ్యలతో కూడిన టికెట్‌కు ఈ బంపర్ ప్రైజ్ దక్కింది. వెస్ట్రన్ కెనడా లాటరీ కార్పొరేషన్ (WCLC) పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఆమెకు ఈ ప్రైజ్ మనీని అందజేశారు.

ఊహించని రీతిలో భారీ మొత్తం దక్కడంపై స్నేహ జాయ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఫలితం చూసిన క్షణంలో తనకు మాటలు రాలేదని, అది "షాక్.. సంతోషం.. ఉపశమనం" లాంటి అనుభూతిని ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఈ గెలుచుకున్న మొత్తంతో ముందుగా తమ ఇంటి రుణాన్ని (Mortgage) పూర్తిగా చెల్లిస్తానని తెలిపారు. అలాగే ప్రపంచమంతా పర్యటించాలని, కుటుంబ సభ్యులతో ఈ ఆనందాన్ని పంచుకుంటూ ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిళ్లు లేని ప్రశాంత జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.

స్నేహ జాయ్ స్వస్థలం కేరళలోని ఎర్నాకుళం జిల్లా వెంగూరు. వృత్తిరీత్యా ఇంజినీర్ అయిన ఆమె, స్థానిక కాంగ్రెస్ నేత పి.పి. జాయ్, జాలీ జాయ్ దంపతుల ఏకైక కుమార్తె. దాదాపు ఐదేళ్ల క్రితం ఆమె తన భర్త విజిల్‌ వర్గీస్‌తో కలిసి కెనడాలోని ఎడ్మంటన్‌ నగరానికి వలస వెళ్లారు. విజిల్‌ స్వస్థలం కేరళలోని మలప్పురం జిల్లా నిలంబూర్. ప్రస్తుతం విదేశంలో స్థిరపడిన ఈ దంపతులకు భారీ జాక్‌పాట్ తగలడంతో కుటుంబసభ్యులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.