దేశంలో ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తయారీ సంస్థ ‘బిస్లెరీ ఇంటర్నేషనల్’పై న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) సిద్ధమైంది. ల్యాబొరేటరీ పరీక్షల్లో కంపెనీకి చెందిన నీటి నమూనాలు సురక్షితం కావని తేలడంతో, సంస్థపై ప్రాసిక్యూషన్ ప్రక్రియను ప్రారంభించినట్లు ఎఫ్‌ఎస్ఎస్ఏఐ ప్రకటించింది.

బిస్లెరీ సంస్థకు చెందిన ప్రాంగణం నుంచి సేకరించిన ప్యాకేజ్డ్ తాగునీటి నమూనాలను తొలుత పరీక్షించినప్పుడు, అందులో ‘బ్రోమేట్’ పరిమాణం నిర్ణీత పరిమితుల కంటే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 ప్రకారం ఆ నీటిని అన్‌సేఫ్ (సురక్షితం కానిది)గా అధికారులు ప్రకటించారు. అయితే, ప్రాథమిక పరీక్ష ఫలితాలపై బిస్లెరీ సంస్థ అప్పీల్ చేయడంతో, ఆ నమూనాలను మరింత సమగ్ర పరిశీలన కోసం రెఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించారు.

రెండో ల్యాబ్ పరిశీలనలోనూ ఆ నీటి నమూనాలు ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. అంతేకాకుండా, అందులో ప్రమాదకరమైన ‘పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్’ (PAHs) ఉన్నట్లు నిర్ధారణ అయింది. సాధారణంగా బ్రోమేట్, పీఏహెచ్‌లను క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు (కార్సినోజెన్లు)గా పరిగణిస్తారు. ఈ ల్యాబ్ నివేదికల ఆధారంగా నిబంధనల ఉల్లంఘన స్పష్టంగా రుజువు కావడంతో, బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఫుడ్ సేఫ్టీ చట్టం కింద ప్రాసిక్యూషన్ చర్యలు ప్రారంభించేందుకు అనుమతి మంజూరు చేసినట్లు ఎఫ్‌ఎస్ఎస్ఏఐ తెలిపింది. కాగా, ఈ పరిణామంపై బిస్లెరీ సంస్థ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

మరోవైపు, ప్రఖ్యాత మిఠాయిల తయారీ సంస్థ ‘ఆశా కన్ఫెక్షనరీ’కి చెందిన ప్రీ-ప్యాక్డ్ చాక్లెట్-ఫిల్డ్ కుకీల బ్యాచ్‌ను వెంటనే మార్కెట్ నుంచి రీకాల్ చేయాలని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఉత్పత్తి లేబులింగ్, పదార్థాల నాణ్యత, భద్రతా ప్రమాణాల్లో లోపాలు ఉన్నట్లు తేలింది. పరీక్షల్లో ఆ కుకీలలో లేబుల్‌పై ప్రస్తావించని ‘కార్మోసిన్’ అనే సింథటిక్ రంగును గుర్తించారు. అంతేకాకుండా అనుమతించిన స్థాయి కంటే ఎక్కువగా ‘టార్ట్రాజైన్’, ఈ తరహా ఆహార పదార్థాల్లో అస్సలు ఉపయోగించకూడని ‘సన్‌సెట్ ఎల్లో ఎఫ్‌సీఎఫ్’ రంగును వాడినట్లు అధికారులు కనుగొన్నారు. దీంతో ఈ ఉత్పత్తిని నిబంధనలకు విరుద్ధమైనదిగా, నాణ్యతా లోపంతో కూడినదిగా పేర్కొంటూ, మార్కెట్లో ఉన్న ప్రభావిత బ్యాచ్ మొత్తాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సంస్థను ఆదేశించింది.