జేబులో ఫోన్‌.. ఆకాశంలో ఉరుములు, మెరుపులు.. మొబైల్‌ పేలుతుందా?

జేబులో ఫోన్‌.. ఆకాశంలో ఉరుములు, మెరుపులు.. మొబైల్‌ పేలుతుందా?

Mobile Phone in Pocket During Thunder and Lightning Will It Explode
  • ఫోన్‌ పిడుగును ఆకర్షించదంటున్న సైన్స్‌
  • పిడుగు పడిన సమీపంలో ఉంటే మాత్రం సర్య్కూట్లు దెబ్బతిని పేలుడు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరిక
  • ఎత్తైన వస్తువులు, పొడవైన చెట్లు, ఎత్తైన నిర్మాణాలే పిడుగు పడేందుకు అనువైన ప్రదేశాలని వివరణ
  • ఆరు బయట ఉంటే పిడుగుపాటు వల్ల సంభవించే ప్రభావానికి లోనయ్యే ప్రమాదం
  • లోహం ఉన్నంత మాత్రాన ప్రత్యేకంగా ఫోన్‌ పిడుగును ఆకర్షించదంటున్న నిపుణులు
పిడుగు పడ్డ ప్రాంతానికి సమీపంలో ఉన్న వారి జేబుల్లోని ఫోన్లు పేలిన ఘటన నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో నమోదయ్యాయి. దీంతో అందరిలోనూ ఒకటే అనుమానం.. పిడుగు వల్లే ఫోన్‌ పేలిందా? వర్షం పడుతున్నప్పుడు మొబైల్‌ ఫోన్‌ ఉంటే పిడుగు మనపై పడుతుందా?

ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఈ ప్రశ్నలు రావడం సహజమే. కానీ ఫోన్‌కు, పిడుగుకు సంబంధించి చాలా అపోహలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. అసలు నిజమేంటో తెలుసుకోవాలంటే ముందుగా పిడుగు ఎలా ఏర్పడుతుందో తెలుసుకోవాలి.

అసలు పిడుగు ఎలా పడుతుంది?
వర్షం పడే ముందు ఆకాశంలో కనిపించే భారీ మేఘాల లోపల పరిస్థితులు చాలా గందరగోళంగా ఉంటాయి. మంచు ముక్కలు, నీటి బిందువులు, చిన్న చిన్న మంచు కణాలు బలమైన గాలులతో అటూ ఇటూ తిరుగుతూ ఒకదానికొకటి ఢీకొంటుంటాయి.

ఈ ప్రక్రియలో మేఘాల్లో విద్యుత్‌ ఛార్జీలు విడిపోతాయి. కొంతసేపటికి మేఘాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో భారీగా ఛార్జీలు పేరుకుపోతాయి. మేఘానికి, భూమికి మధ్య కూడా విద్యుత్‌ ప్రభావం పెరుగుతుంది.

ఈ పరిస్థితి ఒక స్థాయికి చేరినప్పుడు ఆ విద్యుత్‌ ఒక్కసారిగా దూసుకెళ్లే మార్గం ఏర్పడుతుంది. అదే మనకు పిడుగుగా కనిపిస్తుంది. దాని వెంట వచ్చే భారీ శబ్దమే ఉరుము.

పిడుగును ఫోన్‌ ఆకర్షిస్తుందా?
లేదు. మొబైల్‌ ఫోన్‌ పిడుగును ఆకర్షించదు. ఫోన్‌లో లోహ భాగాలు ఉంటాయి కాబట్టి పిడుగు దానివైపు లాగబడుతుందనే మాట చాలామందిలో ఉంది. కానీ ఇది నిజం కాదు. పిడుగు ఎక్కడ పడాలన్నది ఫోన్‌ చేతిలో ఉందా లేదా అన్నదానిపై ఆధారపడదు.

ఎత్తుగా ఉండే వస్తువులు, పొడవైన చెట్లు, పక్కన ఏమీ లేని చోట బాగా పైకి ఉన్న టవర్లు, చెట్లు, నిర్మాణాలు పిడుగు పడడానికి అనువైన ప్రదేశాలు. అందుకే ఆరుబయట నిలబడి ఉండటమే అసలు ప్రమాదం.

మరి ఫోన్‌ ఎలా పేలింది?
ఇక్కడే అసలు ట్విస్ట్‌ ఉంది. సమీపంలో పిడుగు పడితే దాని ప్రభావం చుట్టుపక్కల ఉన్న ఎలక్ట్రానిక్‌ పరికరాలపై పడొచ్చు. పిడుగు పడినప్పుడు భారీ స్థాయిలో విద్యుత్‌ ప్రవాహం ఏర్పడుతుంది. దాంతో పాటు బలమైన విద్యుదయస్కాంత ప్రభావం కూడా ఉంటుంది. పిడుగు నేరుగా ఫోన్‌ను తాకకపోయినా.. సమీపంలో పడినప్పుడు ఏర్పడే ఈ ప్రభావం ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్లను దెబ్బతీసే అవకాశం ఉంటుంది.

లోహం ఉంటే ప్రమాదం పెరుగుతుందా?
లోహం పిడుగును లాగదు. కానీ పిడుగు తాకితే లోహం ద్వారా విద్యుత్‌ సులభంగా ప్రయాణిస్తుంది. అందుకే పిడుగులు పడుతున్న సమయంలో విద్యుత్‌ తీగలు, లోహ కంచెలు, రెయిలింగ్‌ల వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ఇదే కారణంగా ‘ఫోన్‌లో మెటల్‌ ఉంది కాబట్టి పిడుగు దానిని వెతుక్కుంటూ వస్తుంది’ అనుకోవడం తప్పని నిపుణులు చెబుతున్నారు.

మరి వర్షంలో ఫోన్‌ వాడొచ్చా?
ఇక్కడ ఫోన్‌ కంటే మనమున్న ప్రదేశమే ముఖ్యం. ఉరుములు, మెరుపులు మొదలైతే బయట ఉండకూడదు. చెట్టు కింద నిలబడటం కూడా సురక్షితం కాదు. వీలైనంత త్వరగా పక్కా భవనంలోకి వెళ్లాలి. పూర్తిగా మూసి ఉన్న కారు కూడా బయట ఉండడం కంటే సురక్షితమైన ఆశ్రయం. అంటే పిడుగు సమయంలో ఫోన్‌ను జేబులోంచి తీసి పడేయడం వల్ల ప్రత్యేకంగా ప్రయోజనం లేదు. బయట ఉంటే ఫోన్‌ కాదు.. మనమే ప్రమాదంలో ఉంటాం.

‘మొబైల్‌ ఫోన్‌ పిడుగును ఆకర్షిస్తుంది’ అనేది అపోహ. అయితే పిడుగు సమీపంలో పడితే దాని ప్రభావం ఎలక్ట్రానిక్‌ పరికరాలపై పడే అవకాశం మాత్రం ఉంది. ఫోన్‌ పేలిన ప్రతి ఘటనకు పిడుగే కారణమని చెప్పలేం. అందుకే ఆకాశంలో మెరుపులు కనిపించి, ఉరుములు వినిపిస్తే.. ఫోన్‌ గురించి ఆలోచించడం కంటే ముందుగా సురక్షితమైన చోటుకు వెళ్లడం ముఖ్యం.
Advertisement
Mobile Phone
Lightning Strike
Smartphone Explosion
Thunderstorm Safety
Nizamabad News
Weather Myths

More Telugu News