'కుటుంబం కోసమే బతుకుతున్నా'.. కదిలిస్తున్న క్యాబ్ డ్రైవర్ మాటలు
- బెంగళూరు క్యాబ్ డ్రైవర్ జీవిత కథ వైరల్
- రోజుకు రూ.1,200 సంపాదనతో కుటుంబ పోషణ
- ముగ్గురు పిల్లలు, తల్లి బాధ్యత ఒక్కరిపైనే
- నెలకు ఒక్కసారి కుటుంబంతో బిర్యానీ తినడం అతడి ఆనందం
- బాధ్యతల ఒత్తిడితో ఆత్మహత్య ఆలోచనలు వచ్చినట్లు వెల్లడి
- ఎక్స్‌లో పోస్ట్ చేసిన సిద్ధార్థ్ భావోద్వేగ వ్యాఖ్యలు వైరల్
32 ఏళ్ల ఆ క్యాబ్ డ్రైవర్‌కు ముగ్గురు పిల్లలున్నారు. ప్రేమించిన అమ్మాయినే 11 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఒక్కరే. భార్య, పిల్లలతో పాటు తల్లిని కూడా ఆయనే పోషిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్‌గా మారే ముందు ఎన్నో రకాల ఉద్యోగాలు చేశాడు. ప్రస్తుతం రోజుకు సుమారు రూ.1,200 సంపాదిస్తున్నానని చెప్పాడు. అన్ని బాధ్యతల మధ్య కూడా ప్రతి నెలా ఒకసారి కుటుంబ సభ్యులను బయటకు తీసుకెళ్లి బిర్యానీ తినిపించడం తనకు ఎంతో ఆనందాన్నిస్తుందని చెప్పడం సిద్ధార్థ్‌ను కదిలించింది.
అయితే, అతడు చెప్పిన మరో విషయం మరింత కలచివేసింది. కుటుంబ బాధ్యతల ఒత్తిడితో ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చిందని వాపోయాడు. కానీ తన కుటుంబం కోసం ఆ ఆలోచనను విరమించుకున్నానని తెలిపాడు. బాధ్యతల భారం తనను లోపల నుంచి తినేస్తున్నా, బయట మాత్రం నవ్వుతూ జీవితం సాగిస్తున్నానని చెప్పిన మాటలు సిద్ధార్థ్‌ను తీవ్రంగా ఆలోచింపజేశాయి.
ఈ పోస్టుపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. ఇలాంటి కథలు తమకు ఉన్న సౌకర్యాల విలువను గుర్తు చేస్తాయని కొందరు వ్యాఖ్యానించగా.. పెరుగుతున్న జీవన వ్యయం, తగ్గిన ఆదాయ అవకాశాలు మధ్యతరగతి, కార్మిక కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని మరికొందరు అభిప్రాయపడ్డారు. ‘‘ప్రపంచానికి అతడు ఒక క్యాబ్ డ్రైవర్ మాత్రమే కావచ్చు.. కానీ తన కుటుంబానికి మాత్రం నిజమైన హీరో’’ అంటూ పలువురు స్పందించారు.