ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా ఇండియా అమ్మకాల్లో సరికొత్త శిఖరాలను అధిరోహించింది. 2026 అక్టోబర్ నెలలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 33,462 యూనిట్ల హోల్‌సేల్ అమ్మకాలను నమోదు చేసి సంచలనం సృష్టించింది. గతేడాది అక్టోబర్ (2025)లో విక్రయించిన 29,556 యూనిట్లతో పోలిస్తే ఇది 13.22% అధికం. వరుసగా రెండో నెల కూడా కియా రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేయడం విశేషం. సెప్టెంబర్ 2026లో సాధించిన 32,017 యూనిట్ల రికార్డును అక్టోబర్‌లో అధిగమించింది.

పండుగ సీజన్‌లో వినియోగదారుల నుంచి వచ్చిన బలమైన డిమాండ్ ఈ రికార్డు అమ్మకాలకు ప్రధాన కారణంగా నిలిచింది. ఈ ఏడాది (2026) జనవరి నుంచి అక్టోబర్ వరకు కియా మొత్తం 2,86,470 యూనిట్లను విక్రయించింది. గతేడాది (2025) మొత్తం విక్రయించిన 2,80,286 యూనిట్ల సంఖ్యను కేవలం 10 నెలల్లోనే అధిగమించడం కంపెనీ వృద్ధి వేగానికి నిదర్శనంగా నిలుస్తోంది.

సెల్టోస్, సోనెట్ హవా

కియా అమ్మకాల్లో ఎస్‌యూవీలు సెల్టోస్, సోనెట్ కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా, అప్‌డేటెడ్ వెర్షన్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి సెల్టోస్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. జనవరి 2026 నుంచి ప్రతి నెలా సగటున 10,000 యూనిట్లకు పైగా అమ్ముడవుతున్న సెల్టోస్, ఒక్క అక్టోబర్‌లోనే 13,000 యూనిట్లకు పైగా విక్రయమైంది. కారెన్స్ (కారెన్స్ క్లావిస్‌తో కలిపి) శ్రేణి కూడా అమ్మకాలను గణనీయంగా పెంచింది. మొత్తం అమ్మకాల్లో దాదాపు 10% వాటాను సీఎన్‌జీ వేరియంట్లు దక్కించుకోవడం గమనార్హం.

విభిన్న విభాగాల్లోనూ రాణింపు

కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన సొరెంటో ఎస్‌యూవీకి సైతం మంచి స్పందన లభిస్తోంది. హైబ్రిడ్, డీజిల్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్న ఈ మోడల్ టెక్నాలజీ, ఫీచర్లు, మైలేజీ విషయంలో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. మరోవైపు, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోనూ కియా తన పట్టును నిరూపించుకుంది. అక్టోబర్‌లో అత్యధిక ఈవీ అమ్మకాలను నమోదు చేసింది. సిరోస్ ఈవీ, కారెన్స్ క్లావిస్ ఈవీ మోడళ్లు ఈ వృద్ధికి దోహదపడ్డాయి. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్.. ఇలా అన్ని పవర్‌ట్రెయిన్ విభాగాల్లోనూ వాహనాలను అందిస్తూ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది.

ఈ రికార్డు స్థాయి ప్రదర్శనపై కియా ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ హర్షం వ్యక్తం చేశారు. "వినియోగదారుల నమ్మకం, పండుగ సీజన్ డిమాండ్, మా విజయవంతమైన మోడళ్లు, కొత్త ఆవిష్కరణలకు లభిస్తున్న సానుకూల స్పందనే ఈ విజయానికి కారణం. మా మల్టీ-పవర్‌ట్రెయిన్ వ్యూహం సత్ఫలితాలనిస్తోంది," అని ఆయన వివరించారు.