వామ్మో.. మనిషి ఇంత గట్టిగా అరవగలడా? విమానం శబ్దానికే సవాల్!

Joseph Loudest Shout World Record Beats Jet Engine Sound
  • ఆస్ట్రేలియాకు చెందిన జోసెఫ్‌ గిన్నిస్‌ రికార్డు
  • 122.4 డెసిబెల్స్‌ శబ్దంతో ప్రపంచ రికార్డు
  • ‘నౌ’ అనే పదాన్ని అరిచి ఘనత
  • 1994 నుంచి కొనసాగుతున్న పాత రికార్డు
  • జోసెఫ్‌ వృత్తిరీత్యా ఎయిర్‌ కండీషనర్‌ టెక్నీషియన్‌
  • ఏడు ప్రయత్నాల తర్వాత రికార్డు స్థాయి శబ్దం
మనం గట్టిగా అరిస్తే ఎంత దూరం వినిపిస్తుంది? మహా అయితే వీధి చివర ఉన్న వ్యక్తి వరకు చేరుతుంది. కానీ విమానం టేకాఫ్‌ అయ్యే సమయంలో ఇంజిన్ చేసే శబ్దం స్థాయిలో ఎవరైనా అరవగలరా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి అదే చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతడి అరుపు ఏకంగా జెట్‌ ఇంజిన్‌ గర్జనకు సమానంగా నమోదైంది. దీంతో గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ఆ విశేషాలేంటో చూద్దాం..

కాన్‌బెర్రాకు చెందిన 58 ఏళ్ల జోసెఫ్‌ ‘నౌ’ అనే పదాన్ని 122.4 డెసిబెల్స్‌ శబ్దంతో అరిచాడు. ఈ స్థాయి శబ్దం సాధారణంగా జెట్‌ విమానం టేకాఫ్‌ సమయంలో లేదా అంబులెన్స్‌ సైరన్‌ పక్కనే నిల్చున్నప్పుడు వినిపిస్తుంది. జోసెఫ్‌ అరుపుతో దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రపంచ రికార్డు చెరిగిపోయింది. 1994లో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన అన్నలీసా ఫ్లానగన్‌ 121.7 డెసిబెల్స్‌తో నెలకొల్పిన రికార్డును ఆయన అధిగమించాడు.

ఈ ఘనత సాధించిన జోసెఫ్‌ వృత్తిరీత్యా ఎయిర్‌ కండీషనర్‌ టెక్నీషియన్‌. అదే సమయంలో కాన్‌బెర్రా నగరానికి టౌన్‌ క్రయర్‌గా కూడా సేవలందిస్తున్నాడు. ప్రజలకు ముఖ్య ప్రకటనలు గట్టిగా వినిపించే బాధ్యత ఆయనది. అందుకే గొంతును గట్టిగా వినిపించే నైపుణ్యం ఆయనకు అలవడింది. 

ఈ రికార్డు కోసం ప్రత్యేక పరికరాలతో పరీక్ష నిర్వహించారు. మొదటి ప్రయత్నంలోనే విజయం రాలేదు. ఏడు సార్లు ప్రయత్నించిన తర్వాత చివరకు 122.4 డెసిబెల్స్‌ మార్కును అందుకున్నాడు. అయితే ఈ విజయం కోసం మూల్యం కూడా చెల్లించాల్సి వచ్చింది. రికార్డు తర్వాత కొన్ని రోజుల పాటు ఆయన గొంతు పూర్తిగా బొంగురుపోయిందని వెల్లడించాడు.

జోసెఫ్‌కు గిన్నిస్‌ రికార్డులు కొత్తేమీ కాదు. 2019లో అత్యంత వేగంగా 10 బాణాలు సంధించిన ఆర్చర్‌గా కూడా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆ రికార్డు తర్వాత బద్దలైనప్పటికీ ఇప్పుడు మరోసారి గిన్నిస్‌ పుస్తకంలో తన పేరును నమోదు చేసుకున్నాడు.
Go Back to Shorts
Joseph
Guinness World Record
Loudest Shout
Canberra Town Crier
Decibels
Jet Engine Sound

More Telugu News