తప్పుదోవ పట్టించే రీతిలో ఉన్న పాన్ మసాలా ప్రకటన వ్యవహారంలో బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్‌తో పాటు సదరు ఉత్పత్తి సంస్థకు రాజస్థాన్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ నోటీసులు జారీ చేసింది. జోధ్‌పూర్‌కు చెందిన గజేంద్ర కుమార్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను విచారించిన కమిషన్ సర్క్యూట్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. కమిషన్ ప్రెసిడెంట్ దేవేంద్ర కచ్ఛవాహా, సభ్యుడు లియాఖత్ అలీలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసు తదుపరి విచారణను జనవరి 19కి వాయిదా వేసింది.

సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న పాన్ మసాలా ప్రకటనలో నాణ్యత, పదార్థాలకు సంబంధించి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. "జషన్ కా తషన్" అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ ప్రకటనలో కుంకుమపువ్వు, యాలకులు ఉన్నట్లు చూపిస్తున్నారని పేర్కొన్నారు. మార్కెట్‌లో కిలో కుంకుమపువ్వు ధర సుమారు రూ. 4 లక్షల వరకు ఉండగా, కేవలం రూ. 5 నుంచి రూ. 10 ఉండే పాకెట్‌లో కుంకుమపువ్వు ఎలా కలుపుతారని పిటిషనర్ తరఫు న్యాయవాది రామ్‌నివాస్ చౌదరి ప్రశ్నించారు. ఇటువంటి ఆకర్షణీయమైన ప్రకటనల వల్ల యువత వ్యసనాల బారిన పడటమే కాకుండా, క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.

దీంతోపాటు జోధ్‌పూర్ జిల్లా వినియోగదారుల కమిషన్‌లో సల్మాన్ ఖాన్ తరఫున సమర్పించిన వకాలత్‌నామాలోని సంతకాల ప్రామాణికతపైనా పిటిషనర్ అనుమానాలు వ్యక్తం చేశారు. సల్మాన్ ఖాన్ స్వయంగా హాజరుకావాలని, ఆ సంతకాలపై ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించాలని గతంలో కోరగా జిల్లా కమిషన్ తిరస్కరించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషనర్ రాష్ట్ర కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ రివిజన్ పిటిషన్‌పై నిర్ణయం వెలువడే వరకు జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఉన్న మూల ఫిర్యాదుపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోవద్దని రాష్ట్ర కమిషన్ స్పష్టం చేసింది. సెలబ్రిటీలు చేసే ఇలాంటి పాన్ మసాలా ప్రకటనలపై రాజస్థాన్‌లో న్యాయపరమైన విచారణలు కొనసాగుతుండటం గమనార్హం.