బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని బచ్చులవారిపాలెంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య చెలరేగిన ఘర్షణ చివరకు హింసాత్మకంగా మారింది. పరిస్థితి అదుపు తప్పడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపారు.

కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఓట్లను ఇతరులు దొంగ ఓట్లుగా వేశారంటూ కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేస్తూ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో చీరాల మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత ఆమంచి కృష్ణమోహన్ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకోవడంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.

ఈ క్రమంలో టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువర్గాలు పోలింగ్ బూత్ ఎదుటే కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగాయి. ఈ దాడిలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఘటనా స్థలంలో ఉన్న పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో ఘర్షణ మరింత తీవ్రరూపం దాల్చకుండా నిలువరించేందుకు పోలీసులు గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపి గుంపును చెదరగొట్టారు. అనంతరం పరిస్థితిని అదుపులోకి తెచ్చిన అధికారులు, గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.