మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలని చూస్తోందని సీపీఐ సీనియర్ నేత నారాయణ ఆరోపించారు. హైదరాబాద్‌లో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేసిన నారాయణ, డీలిమిటేషన్ పేరుతో దేశ సమాఖ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సాగనివ్వబోమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చి, దాని మాటున నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.

"మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఉందని, మహిళల పట్ల నిజంగా అంతటి చిత్తశుద్ధి, అంకితభావం ఉంటే డీలిమిటేషన్‌తో ముడిపెట్టకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును ముందుగానే ఆమోదించి అమలు చేయవచ్చు కదా?" అని కేంద్రాన్ని ప్రశ్నించారు.