క్రిమినల్ కేసులో శిక్ష పడిందనే ఏకైక కారణంతో ఉద్యోగం నుంచి తొలగించబడిన వ్యక్తి.. ఆ కేసులో నిర్దోషిగా తేలితే, ఆ నిర్దోషిత్వపు ఉత్తర్వు వచ్చిన నాటి నుంచే తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో పాటు, అదే తేదీ నుంచి బకాయి వేతనాలు (బ్యాక్ వేజెస్) చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగం నుంచి తొలగించిన నాటి నుంచి కాకుండా, కోర్టు కేసు కొట్టివేసిన తేదీ నుంచే ఈ ఆర్థిక ప్రయోజనాలు వర్తిస్తాయని తేల్చిచెప్పింది.

ఈ మేరకు జస్టిస్ రవినాథ్ తిల్హారీ, జస్టిస్ అలపాటి గిరిధర్‌లతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ, దీనిపై బీఎస్ఎన్ఎల్ యాజమాన్యం దాఖలు చేసిన రిట్ పిటిషన్ (నంబర్ 36641/2012)ను న్యాయస్థానం కొట్టివేసింది.

పూర్వాపరాలు:
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట పరిధిలోని వల్లూరు టెలిఫోన్ ఎక్స్‌చేంజ్‌లో బి. పేతురు అనే వ్యక్తి 1992 నుంచి 1998 వరకు బీఎస్ఎన్ఎల్‌లో రెగ్యులర్ మజ్దూర్‌గా పనిచేశారు. ఆ సమయంలో కేబుల్ దొంగతనం జరిగిందన్న ఆరోపణలతో ఆచంట పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఐపీసీ సెక్షన్ 379 కింద కేసు నమోదైంది. అనంతరం విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనను దోషిగా తేలుస్తూ ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. ఈ శిక్షను ఆధారంగా చేసుకుని, సీసీఎస్ (సీసీఏ) నిబంధనలు 1965లోని రూల్ 19 ప్రకారం 2001 మార్చి 3న బీఎస్ఎన్ఎల్ ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది.

అయితే, ఈ తీర్పుపై పేతురు జిల్లా అదనపు మరియు సెషన్స్ కోర్టు (ఫాస్ట్ ట్రాక్ కోర్టు)లో క్రిమినల్ అప్పీల్ దాఖలు చేశారు. కేసును పునఃసమీక్షించిన సెషన్స్ కోర్టు, 2004 మే 18న ఆయనపై ఉన్న శిక్షను పూర్తిగా రద్దు చేసి నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది.

క్యాట్ ఉత్తర్వులు:
నిర్దోషిగా విడుదలైన నేపథ్యంలో.. తనను తిరిగి సర్వీసులోకి తీసుకుని, అన్ని బకాయి వేతనాలను చెల్లించాలని కోరుతూ పేతురు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌ (క్యాట్)ను ఆశ్రయించారు. 2012 జూలై 13న విచారణ పూర్తి చేసిన క్యాట్.. ఉద్యోగిని విధుల్లోకి చేర్చుకోవాలని ఆదేశించింది. అంతేకాకుండా, కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించిన తేదీ (2004 మే 18) నుంచి బకాయి వేతనాలు చెల్లించాలని, ఉద్యోగం నుంచి తొలగించిన నాటి నుంచి నిర్దోషిగా మారే వరకు ఉన్న కాలాన్ని డ్యూటీగా పరిగణించరాదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ బీఎస్ఎన్ఎల్ అధికారులు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు.

హైకోర్టు తీర్పు:
హైకోర్టు ధర్మాసనం ఈ వ్యవహారంపై సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. ఉద్యోగిపై నేరారోపణ రుజువై శిక్ష అమల్లో ఉన్నంత వరకు, ఆయనను బీఎస్ఎన్ఎల్ సంస్థ చట్టవిరుద్ధంగా విధులకు దూరం చేసిందని చెప్పలేమని న్యాయస్థానం పేర్కొంది. అందువల్ల ఆ కాలానికి బకాయి వేతనాలు పొందే హక్కు ఉద్యోగికి ఉండదని స్పష్టం చేసింది.

అయితే, సదరు ఉద్యోగిని కేవలం క్రిమినల్ కేసు ఆధారంగానే తొలగించారు కాబట్టి, ఆయన నిర్దోషిగా తేలిన వెంటనే సంస్థ ఆ తొలగింపు ఉత్తర్వులను ఉపసంహరించి ఉండాల్సిందని ధర్మాసనం గుర్తుచేసింది. నేరం కొట్టివేయబడిన తర్వాత కూడా ఆయనను విధుల్లోకి తీసుకోకపోవడం సంస్థ తప్పిదమేనని, అది చట్టవిరుద్ధంగా ఉద్యోగిని విధులకు దూరం చేయడమే అవుతుందని వ్యాఖ్యానించింది. అందువల్ల నిర్దోషిగా విడుదలైన నాటి నుంచే ఆయనకు బకాయి వేతనాలు చెల్లించాలంటూ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు సమంజసమైనదేనని సమర్థిస్తూ, బీఎస్ఎన్ఎల్ అభ్యర్థనను తోసిపుచ్చింది.