బాంబు బెదిరింపుల నేపథ్యంలో భారీ భద్రత నడుమ జరిగిన సంగీత కచేరీలో ప్రముఖ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ముంబయిలోని మహాలక్ష్మి రేస్‌కోర్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రేక్షకుల మధ్య ఉన్న బాలీవుడ్ నటి సాన్యా మల్హోత్రాను ఆయన వేదికపైకి ఆహ్వానించాడు. అనంతరం ఆమెతో కలిసి పాటకు స్టెప్పులేసి అందరినీ ఉత్సాహపరిచాడు. ఈ అనూహ్య పరిణామంతో అక్కడున్న ప్రేక్షకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఈ వీడియోను దిల్జిత్ తన సోషల్ మీడియాలో పంచుకుంటూ, సాన్యాను ప్రశంసించాడు. తన పాటలను రీల్స్ ద్వారా మరింత ప్రాచుర్యంలోకి తెచ్చినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపాడు.

ఇదే కార్యక్రమంలో, తన కచేరీని లక్ష్యంగా చేసుకుని వచ్చిన బాంబు బెదిరింపులపైనా దిల్జిత్ స్పందించాడు. "నా షోకు ఎవరూ రాకూడదని, ప్రజలను భయపెట్టాలనే కొందరు చూశారు. మీరు నాపై బాంబు విసిరినా సరే, నా నుంచి మీకు ప్రేమ మాత్రమే లభిస్తుంది," అని వ్యాఖ్యానించాడు. బెదిరింపులు ఉన్నా ధైర్యంగా వచ్చిన అభిమానులకు, భద్రత కల్పించిన ముంబయి పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపాడు.

కాగా, ఈ కచేరీకి పోలీసులతో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ తనిఖీల అనంతరమే కార్యక్రమాన్ని నిర్వహించారు.