హైదరాబాద్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ), తాత్కాలిక కాంట్రాక్ట్ పద్ధతిలో ఆరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్‌పీవో- డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు కేవలం తెలంగాణకు చెందిన మాజీ సైనికులు, రిటైర్డ్ పారామిలిటరీ సిబ్బంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 26,000 గౌరవ వేతనం అందిస్తారు. ఈ నియామకాల్లో జీతంతో కూడిన సెలవులు ఉండవని, తీసుకునే ప్రతి సెలవును వేతనం లేని సెలవుగా పరిగణిస్తామని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.

దరఖాస్తుదారుల వయసు 2026, నవంబర్ 30 నాటికి 58 ఏళ్లలోపు ఉండాలి. అయితే, గత రెండేళ్లలోపు సర్వీస్ నుంచి రిటైర్ అయిన వారు 60 ఏళ్ల వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు తప్పనిసరిగా చెల్లుబాటులో ఉన్న లైట్ మోటార్ వెహికల్ (ఎల్ఎంవీ) లేదా హెవీ మోటార్ వెహికల్ (హెచ్ఎంవీ) డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వీటితో పాటు తెలంగాణ నివాస ధ్రువీకరణ పత్రం (ఆధార్, ఓటర్ ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్), మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్, డిశ్చార్జ్ సర్టిఫికెట్, ఆధార్, పాన్ కార్డులు, మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు జతచేయాలి.

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను హైదరాబాద్, బంజారాహిల్స్, రోడ్ నం. 12లోని టీజీఐసీసీసీలో రిసెప్షన్ సెంటర్‌లో నవంబర్ 27 నుంచి నవంబర్ 30 మధ్య స్వయంగా సమర్పించాలి. నవంబర్ 30, సాయంత్రం 5 గంటలకు దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తు సౌకర్యం గానీ, ఫోన్ ద్వారా విచారణలకు గానీ అవకాశం లేదని అధికారులు తెలిపారు.