హైదరాబాద్ నగరాన్ని ఈరోజు తెల్లవారుజామున భారీ వర్షం ముంచెత్తింది. గడిచిన పదేళ్లలో నవంబర్ నెలలో ఇదే అత్యధిక వర్షపాతం కావడం గమనార్హం. దాదాపు 28 రోజుల తర్వాత కురిసిన ఈ కుండపోత వానతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 గంటల మధ్య కురిసిన వర్షానికి కూకట్‌పల్లి, సఫిల్‌గూడ, షేక్‌పేట్, చర్లపల్లి, బోరబండ, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో 60-80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ వర్షాలు కురిశాయి. తెలంగాణ అభివృద్ధి, ప్రణాళికా సొసైటీ డేటా ప్రకారం, కూకట్‌పల్లి, సఫిల్‌గూడలో కొద్ది గంటల్లోనే 7 సెం.మీ. పైగా వర్షం పడింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. హైదరాబాద్ సమీపంలోని భువనగిరిలో 12 సెం.మీ., ఆలేరులో 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, నవంబర్ 29, 30, డిసెంబర్ 1 తేదీల్లో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. రాబోయే ఐదు రోజుల్లో కనిష్ఠ‌ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోవచ్చని భారత వాతావరణ శాఖ సూచించింది. దీంతో ప్రజలు చలి నుంచి రక్షణ పొందేందుకు సిద్ధమవ్వాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.