ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఇన్‌స్టాగ్రామ్‌'ను ఇకపై టెలివిజన్లలోనూ వీక్షించేలా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు మెటా సంస్థ ప్రకటించింది. "ఇన్‌స్టాగ్రామ్ ఫర్ టీవీ" పేరుతో ఈ నూతన యాప్‌ను త్వరలో భారత్‌లో విడుదల చేయనుంది. దీని ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన రీల్స్, స్టోరీలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పెద్ద స్క్రీన్‌పై వీక్షించవచ్చు.

ముంబైలో శుక్రవారం నిర్వహించిన 'హౌస్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్' వేదికగా మెటా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. అమెజాన్ ఫైర్ టీవీ, ఆపిల్ టీవీ, గూగుల్ టీవీ వంటి స్మార్ట్ టీవీ పరికరాల్లో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు నేరుగా తమ స్మార్ట్ టీవీల నుంచే ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు లేదా మొబైల్ యాప్‌లోని సెట్టింగ్స్ ద్వారా అనుసంధానించుకోవచ్చు. దీని కోసం వినియోగదారులు తమ ప్రస్తుత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతోనే లాగిన్ అయ్యే సౌకర్యం ఉంది.

ఈ టీవీ యాప్ ప్రధానంగా రీల్స్, స్టోరీస్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ఇందులో వీడియోలు ఆటోమేటిక్‌గా ప్లే అవుతాయి, తద్వారా పదేపదే స్క్రోల్ చేయాల్సిన అవసరం ఉండదు. వినియోగదారుల అభిరుచులు, ట్రెండింగ్ కంటెంట్ ఆధారంగా వీడియోలను వివిధ ఛానెళ్ల రూపంలో ఇది ప్రదర్శిస్తుంది. ఒకే టీవీలో ఐదు వేర్వేరు ఖాతాలను జోడించుకోవడంతో పాటు, కుటుంబం కోసం ప్రత్యేకంగా ఒక టీవీ అకౌంట్‌ను కూడా సృష్టించుకోవచ్చు.

టీనేజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని, మొబైల్ వెర్షన్‌లో అమల్లో ఉన్న కంటెంట్ రేటింగ్స్, వినియోగ సమయ పరిమితుల వంటి నిబంధనలనే టీవీ యాప్‌కు కూడా వర్తింపజేస్తున్నట్లు మెటా స్పష్టం చేసింది. మొబైల్ ఫోన్లలో వ్యక్తిగతంగా వీక్షించే షార్ట్ వీడియో కంటెంట్‌ను, కుటుంబమంతా కలిసి లివింగ్ రూమ్‌లో ఆస్వాదించేలా ఒక సామూహిక అనుభవంగా మార్చడమే తమ లక్ష్యమని సంస్థ పేర్కొంది.