దేశవ్యాప్తంగా లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పట్టాలెక్కించేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులను రాబోయే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ బిల్లులకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని సాధిస్తామన్న ధీమాతో ఉన్న ప్రభుత్వం, ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఈ పునర్విభజన కోసం కేంద్రం ఒక కొత్త ఫార్ములాను ప్రతిపాదించింది. దీని ప్రకారం, అన్ని రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల సంఖ్యను ప్రస్తుతమున్న దానిపై ఏకరీతిన 50% పెంచనున్నారు. అయితే, ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు కేటాయించాలనేది 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయిస్తారు. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలు తమ సీట్ల వాటాను కోల్పోతామన్న ఆందోళనలకు తెరపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా, ఉత్తరాది రాష్ట్రాలతో సమానంగా సీట్ల నిష్పత్తి కొనసాగేలా ఈ ఏర్పాటు చేశారు. అయితే, కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల సరిహద్దులను మాత్రం 2011 జనాభా లెక్కల ఆధారంగా గీస్తారు.

ఈ తాజా ప్రతిపాదనతో పునర్విభజన ప్రక్రియను 2027లో జరగాల్సిన జనాభా లెక్కలతో సంబంధం లేకుండా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని అమలు చేయాలంటే పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. గతంలో కాంగ్రెస్ సహా విపక్షాలు పునర్విభజనతో సంబంధం లేకుండానే మహిళా కోటాను అమలు చేయాలని డిమాండ్ చేశాయి. కానీ, సీట్ల పెంపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదన్న భరోసా లభించడంతో గతంలో వ్యతిరేకించిన కొన్ని పార్టీలు కూడా ఇప్పుడు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రక్రియలో భాగంగా రాజ్యాంగంలోని ఎనిమిది అధికరణలను సవరించనున్నారు. ఇందుకోసం మూడు కొత్త రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టి, పాత రెండు బిల్లులను ఉపసంహరించుకుంటారు. ఈ నెల‌ 30 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లులను సభ ముందుకు తీసుకురానున్నారు. ఆధునిక టెక్నాలజీ సహాయంతో రెండేళ్లలోపు పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసి, 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి కొత్త నియోజకవర్గాలను, పెరిగిన సీట్లను అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళిక ప్రకారం, లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్య 850కి, రాష్ట్రాల అసెంబ్లీల గరిష్ఠ సభ్యుల సంఖ్య 650కి చేరనుంది.