కెన్యాలో వందలాది మంది అనుచరుల మరణానికి కారణమైన కల్ట్ లీడర్ పాల్ మెకంజీ మరో కేసులో దోషిగా తేలాడు. యేసును కలుసుకోవాలంటే ఉపవాసంతో ప్రాణాలు వదలాలని బోధించి, 123 మంది మరణానికి కారణమైనందుకు గాను అతడిని దోషిగా నిర్ధారిస్తూ మొంబాసా కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది.

'గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చి' వ్యవస్థాపకుడైన పాల్ మెకంజీ మాటలు నమ్మి అతని అనుచరులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ కేసులో మెకంజీతో పాటు అతని భార్య రోడా ముంబువాతో సహా మరో 29 మందిని కూడా కోర్టు దోషులుగా ప్రకటించింది. గతేడాది మాలిండి పట్టణ సమీపంలోని ఓ విశాలమైన వ్యవసాయ క్షేత్రంలో అధికారులు జరిపిన తవ్వకాల్లో సామూహిక సమాధులు బయటపడ్డాయి. ఈ సమాధుల్లో 400కు పైగా మృతదేహాలను వెలికితీయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మెకంజీ మాటలు నమ్మి ఉపవాసాలు ప్రారంభించిన వారిలో మొదట చిన్నారులే ప్రాణాలు కోల్పోయారని దర్యాప్తులో తేలింది.

పాల్ మెకంజీ ఇప్పటికే అనేక కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నాడు. 190 మంది చిన్నారులతో సహా మొత్తం 191 మంది హత్య కేసులో అతనికి ఈ నెల 7న 200 ఏళ్ల జైలు శిక్ష పడింది. అంతేకాకుండా, చిన్నారులపై క్రూరత్వం, రాడికలైజేషన్‌కు పాల్పడిన మరో కేసులో బుధవారం అతడిని దోషిగా నిర్ధారించారు. ఈ కేసుల్లో శిక్షలను డిసెంబర్‌లో ఖరారు చేయనున్నారు.