భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం, అనుబంధ రంగాలు వెన్నెముక వంటివి. దేశ జనాభాలో సుమారు 46.1 శాతం మంది తమ జీవనోపాధి కోసం ఈ రంగాలపైనే ఆధారపడుతున్నారు. సాగు పనులు సజావుగా సాగాలన్నా, గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఆదాయం పెరగాలన్నా సరసమైన వడ్డీకే సకాలంలో రుణాలు అందడం ఎంతో ముఖ్యం. ఈ దిశగా రైతులకు సులభంగా సంస్థాగత రుణాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక సాధనమే 'కిసాన్ క్రెడిట్ కార్డు' (కేసీసీ).

రైతన్నకు సింగిల్ విండో సదుపాయం
1998లో ప్రారంభమైన కేసీసీ పథకం నేడు సమగ్ర రూపం దాల్చింది. 2020లో సవరించిన నిబంధనల ప్రకారం ఇది రైతులకు సింగిల్‌ విండో విధానంలో రుణాలు అందిస్తోంది. కేవలం పంట సాగుకే కాకుండా కోత అనంతర ఖర్చులు, మార్కెటింగ్ అవసరాలు, వ్యవసాయ నిర్వహణకు అవసరమైన వర్కింగ్ క్యాపిటల్‌ను సమకూరుస్తుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, మత్స్య సాగు, తేనెటీగల పెంపకం లాంటి అనుబంధ రంగాల పెట్టుబడులకు కూడా ఈ కార్డు ద్వారా నిధులు అందుతాయి.

అత్యంత చవకైన వడ్డీకే రుణాలు
కేసీసీ ద్వారా రైతులకు అతి తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తున్నాయి. సవరించిన వడ్డీ రాయితీ పథకం (మిస్) కింద రూ.3 లక్షల వరకు స్వల్పకాలిక వ్యవసాయ రుణాలను 7 శాతం సాధారణ వడ్డీకే అందిస్తారు. తీసుకున్న రుణాన్ని గడువులోగా సక్రమంగా తిరిగి చెల్లించే రైతులకు ప్రభుత్వం మరో 3 శాతం ప్రోత్సాహక రాయితీ ఇస్తుంది. దీనివల్ల రైతులకు కేవలం 4 శాతం రాయితీ వడ్డీకే రుణం అందుబాటులోకి వస్తుంది.

పూచీకత్తు లేని రుణ పరిమితి పెంపు
రైతుల రుణ పరిమితులను ప్రభుత్వం గణనీయంగా పెంచింది. పంట రుణాల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. మత్స్య, ఇతర అనుబంధ రంగాల రుణ పరిమితి కూడా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు చేరింది. ఎలాంటి ఆస్తులు లేదా భూమి తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇచ్చే కొలేటరల్-ఫ్రీ రుణ పరిమితిని రూ.1.6 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచడం చిన్న, సన్నకారు రైతులకు పెద్ద ఊరటనిచ్చింది.

డిజిటల్ కార్డు.. సులభమైన వినియోగం
ఈ పథకం కింద రైతులకు 'రూపే' ఆధారిత క్రెడిట్ కార్డులను అందజేస్తారు. వీటి కాలపరిమితి ఐదేళ్ల వరకు ఉంటుంది. రైతులు తమ అవసరాలకు తగినట్లుగా నగదును డ్రా చేసుకోవచ్చు. డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చు. ఒకేసారి దరఖాస్తు పత్రాలు సమర్పిస్తే సరిపోతుంది. ప్రతి పంట కాలానికి మళ్లీ మళ్లీ బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పని ఉండదు.

ప్రకృతి విపత్తుల వేళ రక్షణ కవచం
వర్షాభావం, వరదలు లాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రైతులు ఆర్థికంగా నష్టపోకుండా కేసీసీ భద్రత కల్పిస్తుంది. విపత్తు సమయాల్లో ఏడాది వరకు వడ్డీని వసూలు చేయరు. తీవ్రమైన నష్టాలు వాటిల్లినప్పుడు ఈ సదుపాయాన్ని ఐదేళ్ల వరకు పొడిగించే వెసులుబాటు ఉంది. ఇది రైతులపై పడే అదనపు భారాన్ని తప్పిస్తుంది.

రైతు ప్రొఫైల్‌కు తగ్గట్లుగా రుణాలు
చిన్న, సన్నకారు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రుణ పరిమితులను కేటాయిస్తారు. భూమి పరిమాణం, సాగు చేసే పంటల ఆధారంగా రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు సులభమైన రుణాన్ని మంజూరు చేస్తారు. భూమి విలువతో సంబంధం లేకుండా బ్రాంచ్ మేనేజర్ అంచనా వేసి పనిముట్ల కొనుగోలు, విత్తనాలు, ఎరువుల ఖర్చులకు ఈ నిధులను అందిస్తారు.

అర్హుల పరిధి విస్తరణ
సొంత భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులు, వాటాదారులు, మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ), ఉమ్మడి బాధ్యతా బృందాల (జేఎల్‌జీ) సభ్యులకు కూడా కేసీసీ ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నారు. పీఎం-కిసాన్ వివరాల ఆధారంగా ఒకే ఒక్క పేజీ దరఖాస్తు ద్వారా కామన్ సర్వీస్ సెంటర్లలో సులభంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.