భారతదేశానికి చెందిన 16 ఏళ్ల యువ వ్యాపారవేత్త రాహుల్ జాన్ అజును రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. 'ఏఐ జర్నీ 2026' సదస్సులో ఆయన ఈ ప్రతిభావంతుడిని కలిశారు. కృత్రిమ మేధ రంగంలో ఈ కుర్రాడు చేస్తున్న కృషి ప్రధాని మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ సంకల్పానికి ఊతమిస్తోందని కొనియాడారు. కజకిస్తాన్ అధ్యక్షుడు కసిమ్-జోమార్ట్ టోకాయేవ్ సమక్షంలో ఈ భేటీ జరిగింది.

సదస్సులో పుతిన్ యువ ఆవిష్కర్తలతో ముచ్చటించారు. ‘ఏఐ రెల్మ్ టెక్నాలజీస్’ వ్యవస్థాపకుడు, సీటీవో అయిన అజుతో ఆయన మాట్లాడారు. స్వదేశీ సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్న తీరును అభినందించారు. "మీ పని ప్రధాని మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ పిలుపును సాకారం చేస్తోంది కదా? యువత సొంత పరిష్కారాలను కనుగొనడానికి మీ కృషి ఎంతగానో ఉపయోగపడుతుంది" అని పుతిన్ వ్యాఖ్యానించారు.

ఇటీవల అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్‌టీఆర్) సంస్థ భారత్‌పై విమర్శలు గుప్పించింది. తయారీ రంగంలో భారత్ మితిమీరిన సామర్థ్యాన్ని పెంచుకుంటోందని ఆరోపించింది. 'మేక్ ఇన్ ఇండియా', పీఎల్ఐ పథకాలు, ఆత్మనిర్భర్ భారత్ విధానాలను తప్పుబట్టింది. అమెరికా ఇలాంటి నివేదిక ఇచ్చిన కొన్ని రోజులకే పుతిన్ భారత ప్రాజెక్టును సమర్థిస్తూ మాట్లాడటం ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

కేరళకు చెందిన రాహుల్ జాన్ అజును నెటిజన్లు ‘ఏఐ కిడ్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. ఇంజినీరింగ్ కాకుండా నార్త్ ఎడపల్లి పాఠశాలలో కామర్స్ చదువుతూనే ఏఐ రంగంలో అడుగుపెట్టాడు. తొమ్మిదేళ్ల వయసు నుంచే సాంకేతికతపై ఆసక్తి పెంచుకున్నాడు. స్వయంగా నేర్చుకుంటూ థింక్‌క్రాఫ్ట్, రెస్క్యూ ఏఐ, మీబాట్ లాంటి అధునాతన సాధనాలను రూపొందించాడు.

సాంకేతిక పరిజ్ఞానం లేని వారికి కూడా ఏఐని చేరువ చేయడమే లక్ష్యంగా అతడు వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాడు. థింక్‌క్రాఫ్ట్ అకాడమీ ద్వారా విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తున్నాడు. ఇప్పటివరకు ఎనిమిది టెడెక్స్ ప్రసంగాలు ఇచ్చాడు. ఐఐటీలు, ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక సెషన్లు నిర్వహించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అతడికి 5 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.