వినియోగదారులకు ఊరటనిస్తూ బియ్యం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గత నెల రోజుల్లోనే కిలో బియ్యంపై సగటున రూ. 10 వరకు ధర తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యలు, అక్రమ నిల్వలపై పౌరసరఫరాల శాఖ నిరంతర దాడులు నిర్వహించడంతో వ్యాపారుల సిండికేట్‌కు అడ్డుకట్ట పడింది. దీంతో ప్రస్తుతం బియ్యం విక్రయశాలల వద్ద ఎలాంటి హడావుడి లేకుండా అమ్మకాలు ప్రశాంతంగా సాగుతున్నాయి.

గత నెలలో ఎల్‌నినో ప్రభావాన్ని సాకుగా చూపి రైస్ మిల్లర్లు, వ్యాపారులు మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించిన విషయం తెలిసిందే. ఖరీఫ్ పంట దిగుబడి ఇంకా చేతికి రాకముందే, రాబోయే ఎనిమిది నెలల పాటు బియ్యం కొరత ఏర్పడుతుందనే ప్రచారం చేస్తూ ధరలను అమాంతం పెంచారు. కొన్ని ప్రాంతాల్లో సన్న బియ్యాన్ని కిలో రూ. 100 వరకు విక్రయించి సామాన్యులను ఇబ్బందులకు గురిచేశారు.

ప్రజల నుంచి వ్యక్తమైన ఆందోళనలతో రంగంలోకి దిగిన ప్రభుత్వం, ధరల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టింది. బీపీటీ, కేఎన్ఎం రకం బియ్యాన్ని కిలో రూ. 66, తెలంగాణ సోనాను రూ. 74, హెచ్‌ఎంటీ రకాన్ని రూ. 79కి మించి అమ్మరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అన్ని దుకాణాల్లో ధరల పట్టికలు తప్పనిసరిగా ఏర్పాటు చేయించి, అధిక ధరలకు విక్రయించిన వారిపై కేసులు నమోదు చేయడంతో వ్యాపారులు దిగివచ్చారు.

మరోవైపు, మార్కెట్‌కు కొత్త ధాన్యం రాక పెరగడం కూడా బియ్యం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమైంది. అయితే, బహిరంగ మార్కెట్లో ధరలు తగ్గినా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో మాత్రం బియ్యం ధరలు ఇంకా అధికంగానే ఉన్నాయని, వాటిని కూడా నియంత్రించాలని వినియోగదారులు కోరుతున్నారు. కాగా, బహిరంగ మార్కెట్లో ధరల పెరుగుదల ప్రభావంతో గత నెలలో రేషన్ బియ్యానికి డిమాండ్ పెరిగిందని అధికారులు వెల్లడించారు.