క్రికెట్ మైదానంలో ఫీల్డర్లు అద్భుతమైన క్యాచ్‌లు అందుకోవడం సాధారణమే. కానీ, స్టేడియం బయట బైక్‌పై వెళుతున్న వ్యక్తి.. మైదానం దాటి వచ్చిన సిక్సర్‌ను ఒంటిచేత్తో పట్టుకోవడం ఎప్పుడైనా చూశారా? పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా పరిధిలోని మింగోరా (స్వాట్)లో సరిగ్గా ఇలాంటి వింత ఘటనే చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

స్థానికంగా జరుగుతున్న 'స్వాట్ ప్రీమియర్ లీగ్' 8వ సీజన్‌లో భాగంగా స్వాట్ స్ట్రైకర్స్, జీకేఆర్ డిర్ జట్ల మధ్య 10 ఓవర్ల టేప్-బాల్ మ్యాచ్ జరిగింది. జీకేఆర్ డిర్ ఇన్నింగ్స్‌లో 6వ ఓవర్ వేస్తున్న సమయంలో, బ్యాటర్ ఎక్స్‌ట్రా కవర్ దిశగా భారీ సిక్సర్ కొట్టాడు. ఆ మైదానం రోడ్డుకు ఆనుకుని ఉండటంతో, బంతి బౌండరీ లైన్ దాటి స్టేడియం వెలుపల రోడ్డు వైపు దూసుకెళ్లింది.

అదే సమయంలో అటుగా ఇద్దరు వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్నారు. బంతి తమ వైపు రావడం గమనించిన వెనుక కూర్చున్న వ్యక్తి, ఒక్కసారిగా చేయి చాచి కదులుతున్న బైక్ పైనుంచే ఒంటిచేత్తో బంతిని పట్టుకున్నాడు. బైక్ ఎక్కడా ఆగలేదు, అతడు బంతిని ఒడిసిపట్టి అలాగే వెళ్లిపోయాడు.

సాంకేతికంగా ఇది మ్యాచ్‌లో అవుట్ కాకపోయినప్పటికీ, ఆ వ్యక్తి ప్రదర్శించిన టైమింగ్, బ్యాలెన్స్ క్రికెట్ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నెటిజన్లు దీనిని 'క్యాచ్ ఆఫ్ ది సెంచరీ', 'క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ క్యాచ్' అంటూ ప్రశంసిస్తున్నారు. న్యూజిలాండ్ ఫీల్డర్ గ్లెన్ ఫిలిప్స్ కంటే గొప్పగా పట్టాడని కొందరు వ్యాఖ్యానించారు. కాగా, ఈ మ్యాచ్‌లో స్వాట్ స్ట్రైకర్స్ జట్టు 34 పరుగుల తేడాతో విజయం సాధించింది.