దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ సినిమాను వీక్షించిన ఆమె, చిత్ర విశేషాలను పంచుకుంటూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కథాంశం, భావోద్వేగ సన్నివేశాలు, సమాజానికి ఇచ్చే స్ఫూర్తిదాయక సందేశం తనను ఎంతగానో ఆలోచింపజేశాయని ఆమె పేర్కొన్నారు.

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి తప్పక చూడాల్సిన సినిమా ఇదని మంత్రి అనిత అభిప్రాయపడ్డారు. ఆడపిల్లల కలలకు తల్లిదండ్రుల నమ్మకం, ప్రోత్సాహం తోడైతే సమాజం విధించే ఎలాంటి హద్దులనైనా అధిగమించవచ్చని ఈ చిత్రం చాటిచెప్పిందని అన్నారు. ఆకాశాన్ని మాత్రమే కాకుండా, అంతరిక్షాన్నే తన గమ్యంగా మార్చుకోగల సత్తా ఆడపిల్లకు ఉందని, ఆమె ఆశయాలకు రెక్కలు ఇవ్వాలే తప్ప సరిహద్దులు గీయకూడదనే గొప్ప సందేశాన్ని దర్శకుడు ఎంతో హృద్యంగా ఆవిష్కరించారని ఆమె కొనియాడారు.

చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి తమ సహజ నటనతో పాత్రలకు ప్రాణం పోశారని మంత్రి ప్రశంసించారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయి చిత్ర విజయానికి మరింత బలాన్ని చేకూర్చారని పేర్కొన్నారు.

ఇంతటి చక్కటి కథను ఎంచుకుని వెండితెరపై అద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు పవన్ సాధినేనికి ఆమె ప్రత్యేక అభినందనలు తెలిపారు. నిరంతరం విభిన్నమైన, భావోద్వేగభరిత కథలను ప్రేక్షకులకు అందిస్తున్న స్వప్న సినిమా నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్‌లతో పాటు, తెలుగు చిత్రసీమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌ను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ మంత్రి అనిత హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.