నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పరీక్షల నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్, తన కుమార్తె పరీక్ష రాస్తున్న గదిలోనే ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడలోని ఒక ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థినికి, స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సప్లిమెంటరీ/ఇంప్రూవ్‌మెంట్ పరీక్షా కేంద్రం కేటాయించారు. అదే కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్న ఆమె తండ్రి, గణితం పరీక్ష జరిగిన రోజున తన కుమార్తె ఉన్న గదిలోనే ఇన్విజిలేషన్ విధుల్లో పాల్గొన్నారు.

నిబంధనల ప్రకారం, తమ రక్త సంబంధీకులు పరీక్ష రాస్తున్న కేంద్రంలో విధులు నిర్వర్తించాల్సిన ఉపాధ్యాయులు లేదా లెక్చరర్లు ఆ విషయాన్ని ముందుగానే ప్రిన్సిపాల్‌కు తెలియజేసి, ఇన్విజిలేషన్ విధులకు దూరంగా ఉండాలి. అయితే, సదరు లెక్చరర్ ఈ నిబంధనను ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు.

ఈ ఘటనపై ఫిర్యాదులు అందడంతో ఇంటర్మీడియట్ బోర్డు విచారణకు ఆదేశించింది. సుమారు పది రోజుల క్రితం బోర్డు అధికారులు కళాశాలను సందర్శించి రహస్య విచారణ చేపట్టి వివరాలు సేకరించారు. లెక్చరర్ తన కుమార్తె పరీక్ష రాస్తున్న గదిలోనే విధుల్లో పాల్గొన్న మాట వాస్తవమేనని రీజినల్ పర్యవేక్షణాధికారి దాశ్రు నాయక్ ధ్రువీకరించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఇంటర్ బోర్డు ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది.