కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టు పెట్టారని, అందుకు సంబంధించిన ఆధారాలను బయటపెడుతున్నామని అన్నారు. సోమవారం కేఆర్‌ఎంబీ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

పల్నాడు వాటర్ గ్రిడ్ విషయంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్నది డ్రామా అని రేవంత్ రెడ్డి విమర్శించారు. 2022లో వైఎస్ జగన్ ప్రభుత్వం పల్నాడు వాటర్ గ్రిడ్‌కు జీవో జారీ చేసినప్పుడు, తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు. ఆ ప్రాజెక్టుకు అప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ఆయన నిలదీశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై ఫిర్యాదు చేశారని తెలిపారు.

"ఏపీకి మంచి మనిషి, తెలంగాణను ముంచే మనిషి కేసీఆర్" అంటూ రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీల వాటాకు కేసీఆర్ అంగీకరించడం వల్లే ఏపీలో అనేక ప్రాజెక్టులు వచ్చాయని ఆరోపించారు. గతంలో హరీశ్ రావు వైఎస్ఆర్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచారని, ఇప్పుడు తమపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

ఎల్ నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని, ప్రాజెక్టుల్లోని నీటిని తాగునీటి అవసరాలకే వాడాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. మరోవైపు, తాగునీటి పంపిణీపై ఏపీ, తెలంగాణ మధ్య వాదనలు కొనసాగడంతో కేఆర్‌ఎంబీ సమావేశం వాయిదా పడింది.