"నేను చనిపోయినా బతికే ఉంటా!" అంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తన ఆలోచనలు, సిద్ధాంతాలను అచ్చుగుద్దినట్లు ప్రతిబింబించే సరికొత్త ఏఐ డిజిటల్ క్లోన్‌ను చూసి ముగ్ధుడైన వర్మ.. మంగళవారం ‘ఎక్స్‌’ వేదికగా ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. హరి గడిపూడి అనే ఏఐ ఇంజినీర్ వర్మ కోసం ఒక ప్రత్యేకమైన డిజిటల్ క్లోన్‌ను రూపొందించాడు. ఎవరైనా ఏ అంశంపై ప్రశ్నించినా.. అచ్చం రాము శైలిలోనే, ఆయన ఆలోచనా విధానానికి తగినట్లుగా ఇది సమాధానాలు ఇస్తుంది.

ఈ క్లోన్‌ గురించి వర్మ స్వయంగా వివరించారు. ప్రస్తుతానికి ఈ సెషన్లు క్లుప్తంగా, దాని పనితీరును అర్థం చేసుకునేలా ఉన్నాయని చెప్పాడు. భవిష్యత్తు అప్‌డేట్లలో తన స్నేహితులను గుర్తించడం, తన అభిరుచికి తగినట్లుగా కథలను సమీక్షించడం, సొంతంగా కథలు రాయడం మాత్రమే కాకుండా పూర్తిస్థాయి ఏఐ సినిమాలను కూడా తీయబోతున్నట్లు ప్రకటించారు. రాబోయే కాలంలో ఏఐ విప్లవం సృష్టించబోయే విధ్వంసంపై వర్మ చాలా కాలంగా హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఆధునికతకు అనుగుణంగా మారని పాత విద్యావ్యవస్థలను, బోర్డులను ఏఐ తుడిచిపెట్టేస్తుందని.. అందులో మొదట బలైపోయేది విద్యార్థులేనని వర్మ జోస్యం చెప్పారు.

ఈ సందర్భంగా ప్రస్తుత చదువుల తీరుపై గతంలో తాను చేసిన విశ్లేషణను వర్మ మరోసారి ప్రస్తావించారు. "చదువు చచ్చిపోయింది.. మేల్కొని సెలబ్రేట్ చేసుకోండి" అంటూ విద్యావ్యవస్థపై నిప్పులు చెరిగారు. ఉదాహరణకు ఒక విద్యార్థి ఎంబీబీఎస్, పీజీ, స్పెషలైజేషన్ అంటూ శరీర భాగాలు, నరాల గురించి బట్టీ పట్టడానికి పదేళ్లు వృథా చేస్తున్నారని గుర్తుచేశారు. ఒక మెషిన్ కేవలం పది సెకన్లలో లక్షలాది కేసులను విశ్లేషించి కచ్చితమైన చికిత్సను సూచిస్తున్నప్పుడు.. విద్యార్థులు పదేళ్లు ఎందుకు వృథా చేయాలని ప్రశ్నించారు. ప్రస్తుత మెడిసిన్ విద్యార్థులు కోర్సు పూర్తిచేసే సమయానికి వాళ్లు చేయడానికి ఏ పనీ మిగలదని ఓ ప్రముఖ వైద్యుడు అన్న మాటలను కోట్ చేశారు.

సమాచారం దొరకని పాత రోజుల్లో బట్టీ పట్టే విధానం ఉపయోగపడిందని, ఒక్క క్లిక్‌తో అంతా తెలిసే నేటి యుగంలో మెమొరీ ఆధారిత చదువులు కేవలం మూర్ఖత్వమేనని వర్మ అభిప్రాయపడ్డారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురాకపోతే, భవిష్యత్తులో ఉండని ఉద్యోగాల కోసం పిల్లలను చదివిస్తూ తల్లిదండ్రులు, పాలకులు వాళ్లను బలిపశువులను చేసినట్లేనని పేర్కొన్నారు. అందుకే క్లాస్‌రూమ్‌లలోకి, పరీక్షల్లోకి ఏఐ టూల్స్‌ను అనుమతించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తు ప్రశ్నపత్రాలు విద్యార్థికి ఎంత తెలుసు? అన్నదాన్ని కాకుండా.. ఏఐని ఎంత తెలివిగా, సృజనాత్మకంగా ఉపయోగించుకోగలడో పరీక్షించేలా ఉండాలని అభిప్రాయపడ్డారు.