తెలంగాణలో ప్రజలకు సంక్షేమం అందిస్తూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం పోరాడుతుంటే బీఆర్‌ఎస్‌ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు అధికారం అనేది ఇక కలేనని ఆయన వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతూ... "కేటీఆర్‌ ఊహా ప్రపంచంలో బతుకుతున్నారు, సోషల్‌ మీడియా లోకంలోనే ఉంటున్నారు" అని విమర్శించారు.

గత బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రభుత్వ వ్యవస్థలను దెబ్బతీశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాటన్నింటినీ సరిదిద్దుతూ, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలను నేరుగా చేరవేస్తుంటే ఓర్వలేక బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు చేస్తున్నారని అన్నారు. గతంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలోనే బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. "పార్టీ ఆర్గనైజేషన్‌ బలోపేతంపై పార్టీ ఇన్‌చార్జితో చర్చించాం. పార్టీలో విభేదాలు లేవు, అలాంటప్పుడు విభేదాలపై చర్చ ఎందుకు జరుగుతుంది?" అని ఆయన ప్రశ్నించారు. పార్టీని మరింత క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, ప్రభుత్వ కార్యక్రమాలను సమన్వయంతో ప్రజల్లోకి చేర్చడమే లక్ష్యంగా ఇన్‌చార్జితో సమావేశాలు జరుగుతున్నాయని, అంతర్గత విభేదాలు ఉన్నాయన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు.